Deepthi Jeevanji: పారాలింపిక్స్ పతక విజేత దీప్తికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.1 కోటి నగదు బహుమతి ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy announces huge bonanza to Paralympics medalist Deepthi Jeevanji
  • ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో పారాలింపిక్స్ పోటీలు
  • 400 మీటర్ల పరుగులో దీప్తి జీవాంజికి కాంస్యం
  • భారీ నజరానా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
ఓరుగల్లు బిడ్డ దీప్తి జీవాంజికి తెలంగాణ సర్కారు భారీ నజరానా ప్రకటించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో జరుగుతున్న పారాలింపిక్స్ పోటీల్లో దీప్తి కాంస్యం సాధించిన సంగతి తెలిసిందే. దీప్తి మహిళల 400 మీటర్ల పరుగులో 55.82 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకం కైవసం చేసుకుంది. 

అథ్లెటిక్స్ క్రీడాంశంలో తెలంగాణకు ఇదే తొలి ఒలింపిక్ పతకం కావడంతో దీప్తి ఘనతకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. తెలంగాణ ఆణిముత్యం దీప్తిపై దేశవ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భారీ నజరానా ఇవ్వాలని నిర్ణయించారు.

దీప్తి జీవాంజికి గ్రూప్-2 ఉద్యోగం, రూ.1 కోటి నగదు బహుమతి ప్రకటించారు. అంతేకాదు, దీప్తికి వరంగల్ లో 500 గజాల ఇంటి స్థలం, ఆమె కోచ్ కు రూ.10 లక్షలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.

పారాలింపిక్స్ క్రీడాకారులకు మెరుగైన శిక్షణ ఇవ్వాలని, ప్రతిభావంతులకు తగిన ప్రోత్సాహం అందించాలని రేవంత్ రెడ్డి సూచించారు.
Deepthi Jeevanji
Bronze
Paralympics
Paris
Revanth Reddy
Telangana

More Telugu News