Chandrababu: ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికే అనర్హులు: సీఎం చంద్రబాబు
- విజయవాడలో చంద్రబాబు ప్రెస్ మీట్
- జగన్ పై, సాక్షిపై విమర్శలు
- వరదల మొదటి రోజు నుంచే విషం కక్కారన్న చంద్రబాబు
- పేపర్ లో, టీవీలో ఇదే బతుకు అంటూ ఆగ్రహం
ఏపీ సీఎం చంద్రబాబు విజయవాడలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జగన్ పైనా, సాక్షి పత్రికపైనా విరుచుకుపడ్డారు. వరదలు వచ్చిన మొదటి రోజు నుంచీ చూస్తున్నాను... నా రాజకీయ చరిత్రలో ఏ పార్టీ కూడా ఈ విధంగా విన్యాసాలు చేసిన దాఖలాలు లేవని అన్నారు.
వరద విషయంలో ప్రభుత్వం విఫలమైంది అంటూ సాక్షిలో మొదటి రోజే విషం కక్కారు అంటూ ధ్వజమెత్తారు. ప్రతి రోజూ ఇవే రాతలు అంటూ మండిపడ్డారు. ఈ విధంగా ప్రజావిద్వేషం ప్రదర్శించే వాళ్లు ప్రజా జీవితంలో, రాజకీయ పార్టీల్లో ఉండడానికే అనర్హులు అని స్పష్టం చేశారు.
ఓడిపోయిన రోజు నుంచి రాష్ట్రంపై కక్షగట్టారని, విషం చిమ్ముతున్నారని చంద్రబాబు విమర్శించారు. వీళ్లందరూ ఇప్పుడెక్కడున్నారు? నిద్రలేస్తే ఆ పేపర్, ఆ టీవీలో అదే బతుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరికి సాయం చేయరు కానీ, రాష్ట్రాన్ని నాశనం చేయడానికి తయారయ్యారు అంటూ మండిపడ్డారు.
ఈ సందర్భంగా ఆయన, ప్రకాశం బ్యారేజి గేట్లకు పడవలు ఢీకొని, గేట్లు దెబ్బతినడంపై స్పందించారు. వీటిని వైసీపీ వాళ్లే పంపించారా అనే అనుమానం కలుగుతోందని తెలిపారు. ఇదంతా ఏదైనా కుట్రలో భాగమా? ప్రభుత్వాన్ని కలవరపరిచేందుకు ఇలాంటివి చేస్తున్నారా? అనేది తనకు అర్థం కావడంలేదని అన్నారు. తాను ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయనని చంద్రబాబు స్పష్టం చేశారు.
"మొన్న వచ్చిన బోట్లు పవర్ ఫుల్ బోట్లు. మామూలుగా చెక్కతో తయారైన బోట్లు కావు... లోహంతో తయారైన బోట్లు అవి. ఆ వచ్చిన బోట్లు గేటు మధ్యలోని కౌంటర్ వెయిట్ ను ఢీకొట్టడంతో డ్యామేజి జరిగింది.
కౌంటర్ వెయిట్ కు తగిలింది కాబట్టి సరిపోయింది... కాలమ్ ను ఢీకొట్టి ఉంటే ప్రాజెక్టుకే ప్రమాదం వాటిల్లేది. ఇదేంటో, ఈ చిత్రవిచిత్రాలేంటో నాకే అర్థం కావడంలేదు. ఆ బోట్లు ఎక్కడ్నించి వచ్చాయో, ఎందుకొచ్చాయో తెలియడంలేదు" అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఇక, వరదలపై ఇవాళే కేంద్రానికి నివేదిక పంపించామని చంద్రబాబు వెల్లడించారు. వరదల వల్ల ఏవిధంగా నష్టం జరిగింది? ఎంత నష్టం జరిగింది? అనే వివరాలతో కూడిన ప్రాథమిక నివేదిక పంపించామని తెలిపారు. దీని ప్రకారం రూ.6,880 కోట్లు అడిగామని, దీన్ని పరిశీలించి వీలైనంత త్వరగా నిధులు పంపిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
బుడమేరుకు పడిన మూడు గండ్లను పూడ్చివేశామని, ఇదొక శుభపరిణామం అని చంద్రబాబు అభివర్ణించారు. గత కొన్నిరోజులుగా నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో బుడమేరు గండ్లు పూడ్చామని వివరించారు. చరిత్రలో జరిగిన తప్పును ఇప్పుడు సరిచేయడానికి ఒక బృహత్తర యజ్ఞం చేశామని తెలిపారు.