Manipur: మళ్లీ భగ్గుమన్న మణిపూర్.. ఐదుగురి మృతి
- నంగ్చప్పీ గ్రామంలో ఒక వ్యక్తిని కాల్చిచంపిన కుకీ తిరుగుబాటుదారులు
- ఒక్కసారిగా చెలరేగిన హింస
- పలు చోట్ల దాడులు.. ఐదుగురు మృతి
కుకీ, మెయ్తెయి తెగల మధ్య తీవ్ర ఘర్షణలు, హింసాత్మక పరిస్థితుల తర్వాత ఇప్పుడిప్పుడే సద్దుమణుగుతున్న మణిపూర్ మరోసారి భగ్గుమంది. అక్కడ మళ్లీ హింస చెలరేగింది. జిబిరామ్ జిల్లాలోని నంగ్చప్పీ గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అనుమానిత కుకీ తిరుగుబాటుదారులు కాల్చి చంపారు. నిద్రిస్తున్న అతడిని హత్య చేశారు. శనివారం ఉదయం జరిగిన ఈ ఘటనతో ఒక్కసారిగా హింస చెలరేగింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. బిష్ణుపూర్ జిల్లాలో జరిగిన రాకెట్ దాడిలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. శనివారం చోటుచేసుకున్న హింసాత్మక పరిస్థితుల్లో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన కార్యక్రమాలు కూడా జరిగాయని పోలీసులు చెప్పారు.
ఇక అంతకుముందు రోజు శుక్రవారం కూడా కక్చింగ్ జిల్లాలో కూడా హింసాత్మక సంఘటనలు జరిగాయి. కాల్పులు, బాంబు దాడులు నమోదయ్యాయని పోలీసులు చెప్పారు. శుక్రవారం ఉదయం బిష్ణుపూర్ జిల్లాలో రాకెట్ దాడులు జరిగాయి. 4.30 గంటలకు జిల్లాలోని ట్రోంగ్లావోబీ వద్ద జరిగిన దాడిలో రెండు నిర్మాణాలు దెబ్బతిన్నాయని, ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారని వివరించారు.
మరో రాకెట్ మొయిరాంగ్ పట్టణంలోని మాజీ ముఖ్యమంత్రి మైరెంబమ్ కోయిరెంగ్ నివాసం ఆవరణలో పడిందని వెల్లడించారు. రాకెట్ దాడుల నేపథ్యంలో యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లు ఉపయోగించాల్సి వస్తోందని చెప్పారు. ఇటీవలి దాడుల దృష్ట్యా మణిపూర్ పోలీసులు ఈ ప్రాంతంలో యాంటీ-డ్రోన్ సిస్టమ్‌లను మోహరించినట్టు కథనాలు పేర్కొంటున్నాయి.