AP Weather: వాతావరణశాఖ బిగ్ అలర్ట్.. ఏపీలో నేడు అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు
- ఆంధప్రదేశ్‌లోని ఉత్తరకోస్తా, దక్షిణ కోస్తా ప్రాంతాలకు భారీ వర్ష సూచన
- పలు చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరిక
- రాయలసీమలో ఇవాళ, రేపు తేలిక పాటి నుంచి మోస్తరు వర్ష సూచన
ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో వరదలు ఉప్పొంగిన విషయం తెలిసిందే. వరద ప్రభావిత ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ్టి, రేపటి వాతావరణంపై అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం కీలక అప్‌డేట్ ఇచ్చింది.
ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతంలో నేడు (ఆదివారం) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. అయితే ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు కూడా వీస్తాయని హెచ్చరించింది. గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంగా వీస్తాయని సూచించింది. ఇక ఉత్తర కోస్తా ఏపీ, యానాం ప్రాంతంలో రేపు (సోమవారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వానలు పడతాయని అప్రమత్తం చేసింది.
దక్షిణ కోస్తా ఏపీలో భారీ వర్షాలు..
దక్షిణ కోస్తా ఏపీలో ఇవాళ (ఆదివారం) భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. అత్యధిక ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. అయితే ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు పడతాయని హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో పాటు బలమైన ఈదురు గాలులు కూడా వీస్తాయని తెలిపింది. ఇక రేపు (సోమవారం) తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
రాయలసీమ వాతావరణ సూచన ఇదే..
రాయలసీమలో ఇవాళ (ఆదివారం) తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం అప్రమత్తం చేసింది. అనేక చోట్ల జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని హెచ్చరించింది. ఇక ఎల్లుండి కూడా దాదాపు ఇదే వాతావరణం ఉంటుందని తెలిపింది.