Vijay: తమిళ హీరో విజయ్ రాజకీయ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు
- ఈ ఏడాది ఫిబ్రవరిలో రాజకీయ పార్టీని ప్రకటించిన హీరో విజయ్
- తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరిట పార్టీ స్థాపన
- 2026 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వెల్లడి
- తాజాగా ఈసీ గుర్తింపుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత
తమిళ స్టార్ హీరో విజయ్ ఇటీవల తమిళగ వెట్రి కళగం (టీవీకే) పేరిట రాజకీయ పార్టీని స్థాపించడం తెలిసిందే. ఇప్పుడు తమ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపును మంజూరు చేసిందని విజయ్ వెల్లడించారు. ఈసీ గుర్తింపు లభించడంతో టీవీకే పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హత సాధించిందని వివరించారు.
విజయ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో తన పార్టీని ప్రకటించారు. పార్టీ ప్రకటన సమయంలోనే 2024 లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయబోవడంలేదని... 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.
విజయ్ రాజకీయ రంగప్రవేశంపై ఎప్పటినుంచో వార్తలు వస్తున్నాయి. తన అభిమానుల సంఘం విజయ్ మక్కళ్ ఇయక్కమ్ చాన్నాళ్లుగా ప్రజా సేవలో కొనసాగుతోందని, అయితే ఆ అభిమాన సంఘం ద్వారా పూర్తి స్థాయి సామాజిక, ఆర్థిక, రాజకీయ మార్పులు తీసుకురావడం సాధ్యం కాదని, అది సాధ్యం కావాలంటే రాజకీయ బలం అవసరమని విజయ్ తన పార్టీ ప్రకటన సమయంలో పేర్కొన్నారు.