KTR: పేరుకేమో ప్రజా ప్రభుత్వం... కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు: కేటీఆర్
- హైదరాబాదులో కొనసాగుతున్న హైడ్రా కూల్చివేతలు
- ఇవాళ పలు చెరువుల్లో నిర్మాణాల తొలగింపు
- ప్లాస్టిక్ షీట్లతో వర్షం నుంచి తలదాచుకుంటున్న వీడియో పంచుకున్న కేటీఆర్
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ సర్కారుపై ధ్వజమెత్తారు. పేరుకేమో ప్రజా ప్రభుత్వం... కూల్చేదేమో నిరుపేదల ఇళ్లు అంటూ మండిపడ్డారు. జోరువానలో, కనికరం లేకుండా కర్కశంగా పేదల గూడు కూల్చేశారని... దిక్కుతోచని స్థితిలో ఆ అభాగ్యులు ప్లాస్టిక్ కవర్ల నీడలో తలదాచుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవాళ రేవంత్ సర్కార్ కూల్చిన ఇళ్లలోని నిరుపేదలు వీళ్లు అంటూ ఆ మేరకు ఓ వీడియో పంచుకున్నారు. హైదరాబాదులో పేదలకు పంపిణీ చేసేందుకు బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన 40 వేల డబుల్ బెడ్రూం ఇళ్లు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ వెల్లడించారు. ఈ ఇళ్లను వెంటనే పేదలకు కేటాయించాలని తెలంగాణ సీఎస్ ను కోరుతున్నానని, తద్వారా, గూడు కూల్పోయిన పేదలు పడే బాధలను చూడాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.
మానవీయ దృక్పథంతో పునరావాసంపై నిర్ణయం తీసుకోవాలని, అందరికీ సమ న్యాయం వర్తింపజేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు. హైడ్రా ఇవాళ హైదరాబాద్ శివార్లలోని పలు చెరువుల్లో పలు నిర్మాణాలను తొలగించడం తెలిసిందే.