Manchu Vishnu: మంచు విష్ణుపై యూట్యూబ్‌లో తప్పుడు వీడియోలు.. నటుడు శివబాలాజీ ఫిర్యాదు
- మంచు విష్ణును ట్రోల్ చేస్తూ వీడియోలు
- విజయ్ చంద్రహాస్ దేవరకొండ అనే యూట్యూబర్‌పై కేసు నమోదు
- వ్యూస్ పెంచుకునేందుకే ఇలాంటి వీడియోలు చేస్తున్నట్టు అంగీకారం
టాలీవుడ్ ప్రముఖ నటుడు, ‘ మా’ అధ్యక్షుడు మంచు విష్ణు, ఆయన నిర్మాణ సంస్థను లక్ష్యంగా చేసుకుని కొందరు సామాజిక వేదికల్లో పోస్టులు పెడుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు నటుడు, ‘మా’ కోశాధికారి శివబాలాజీ ఫిర్యాదు చేశాడు. మంచు విష్ణు, ఆయన సంస్థకు వ్యతిరేకంగా, అవమానకరంగా వీడియోలు చేస్తున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ చంద్రహాస్ దేవరకొండ అనే యూట్యూబర్ ఇదంతా చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు ఆయనకు నోటీసులిచ్చారు. తన చానల్‌ను పాప్యులర్ చేసేందుకే తప్పుడు, కల్పిత వీడియోలు చేస్తున్నట్టు నిందితుడు అంగీకరించాడని పోలీసులు తెలిపారు.
కాగా, ఇటీవల మంచు విష్ణు ఫిర్యాదుతో పలు యూట్యూబ్ చానళ్లు మూతపడ్డాయి. నటీనటులపై అసభ్యకరంగా వీడియోలు చేస్తూ పబ్బం గడుపుకొనే ప్రయత్నం చేస్తున్నాయన్న ఫిర్యాదుతో వాటిపై వేటు పడింది. తీరు మార్చుకోకుంటే మరికొన్ని చానళ్లపైనా ఫిర్యాదు చేస్తామని విష్ణు అప్పట్లో హెచ్చరించారు.