Nimmala Rama Naidu: బోట్లకు లంగరు వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారు: నిమ్మల రామానాయుడు
- ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందన్న నిమ్మల
- బ్యారేజీని ఢీకొన్న బోట్లలో మూడు బోట్లు ఒకే యజమానికి చెందినవని వెల్లడి
- బోట్లకు ఉన్న వైసీపీ రంగులు అనుమానాలకు తావిస్తున్నాయని వ్యాఖ్య
ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం బలపడుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్న అధికారులు కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారని చెప్పారు. బ్యారేజీని ఢీకొన్న పడవల్లోని 3 బోట్లు ఒకే యజమానికి చెందినవని... ఈ బోట్లకు లంగర్ వేయకుండా కేవలం ప్లాస్టిక్ తాడుతో కట్టారని అన్నారు. ఈ బోట్ల యజమాని వైసీపీ నేత అని చెప్పారు.
ఒక్కో బోటు 45 నుంచి 50 టన్నుల బరువు ఉందని... ఈ బోట్లు 67, 69, 70 గేట్లను దాటి కౌంటర్ వెయిట్లను బలంగా ఢీకొన్నాయని నిమ్మల తెలిపారు. అయితే అదృష్టవశాత్తు బ్యారేజీకి సంబంధించిన ప్రధాన కట్టడం, గేట్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాంలకు బోట్ల యజమాని ఉషాద్రి రామ్మోహన్ దగ్గరి మనిషని అన్నారు. బోట్లకు వైసీపీ రంగులు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని చెప్పారు. దాదాపు రూ. కోటిన్నర విలువ చేసే బోట్ల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా? అని ప్రశ్నించారు.