Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్ల రిపేర్ పనులు విజయవంతంగా పూర్తి.. కన్నయ్య నాయుడికి సన్మానం
- 5 రోజుల్లోనే పనులు పూర్తి
- సమర్థవంతంగా పనిచేస్తున్న 67, 69, 70వ గేట్లు
- నిపుణులు కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో పనులు పూర్తి చేసిన ఇంజనీర్లు
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద పోటెత్తిన విషయం తెలిసిందే. అయితే వరదలో కొట్టుకొని వచ్చిన బోట్లు బలంగా తాకడంతో దెబ్బతిన్న బ్యారేజీ 67, 69, 70 గేట్ల మరమ్మతులు ఇవాళ (సోమవారం) పూర్తయ్యాయి. బ్యారేజీ వద్ద మరమ్మతు పనులు ముగిశాయి. ఇరిగేషన్ నిపుణుడు కన్నయ్య నాయుడు మార్గదర్శకత్వంలో బెకెమ్ ఇన్ఫ్రా సంస్థకు చెందిన ఇంజినీర్లు పనులు పూర్తి చేశారు. స్టీల్‌తో తయారు చేసిన భారీ కౌంటర్ వెయిట్లను ఇంజినీర్లు అమర్చారు.
కాగా 5 రోజుల్లో మరమ్మతు పనులు పూర్తయ్యాయని అధికారులు ప్రకటించారు. ప్రాజెక్టు మరమ్మతు పనుల్లో కీలక సూచనలు చేసిన నిపుణుడు కన్నయ్య నాయుడిని ఇంజినీర్లు సత్కరించారు. ఈ సందర్భంగా కన్నయ్య నాయుడు మాట్లాడుతూ... రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారం, ప్రోత్సాహంతోనే పనులు త్వరగా పూర్తి చేశామని అన్నారు. ఏపీలో లక్షల ఎకరాల్లో పంటను కాపాడటం ఆనందంగా ఉందని, అన్నదాతలకు నష్టం వాటిల్లకూడదనే ఉద్దేశంతో రేయింబవళ్లు కృషి చేసి మరమ్మతు పనులను పూర్తి చేశామని చెప్పారు.
దెబ్బతిన్న ప్రకాశం బ్యారేజీ మూడు గేట్లు ఇప్పుడు సమర్థవంతంగా పని చేస్తున్నాయని కన్నయ్య నాయుడు చెప్పారు. తుంగభద్ర, ప్రకాశం బ్యారేజీ గేట్లకు మరమ్మతులు చేసి పంట పొలాలను రక్షించడం సంతోషం కలిగించిందని ఆయన వ్యాఖ్యానించారు.