Gurugram auto driver: ఆటోలో మరచిపోయిన ‘డైమండ్ లాకెట్’ను తీసుకెళ్లి ఇచ్చిన డ్రైవర్.. నిజాయతీకి సర్వత్రా ప్రశంసలు
- నిజాయతీకి నిలువుటద్దంగా నిలిచిన గురుగ్రామ్ ఆటో డ్రైవర్
- ఆటోలో బ్యాగు మరచిపోయిన ప్రయాణికురాలికి తీసుకెళ్లి ఇచ్చిన డ్రైవర్
- అందులో ఎంతో విలువైన వస్తువులు ఉన్నా ముట్టుకోని వైనం
- ఆటో డ్రైవర్‌పై కురుస్తున్న ప్రశంసల జల్లు
ఈ రోజుల్లో ఇంత నిజాయతీపరులు ఉన్నారా? అని ఆశ్చర్యపోయేలా ఓ ఆటో డ్రైవర్ వ్యవహరించాడు. గురుగ్రామ్‌కు చెందిన ఓ ఆటోడ్రైవర్ తన ఆటోలో ప్రయాణించిన ఓ మహిళా ప్రయాణికురాలు హ్యాండ్ బ్యాగును మరచిపోగా... దానిని చెక్కుచెదరకుండా తీసుకెళ్లి అందించాడు. ఆ బ్యాగులో ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, క్రెడిట్, డెబిట్ కార్డ్ వంటి కీలకమైన డాక్యుమెంట్లు మాత్రమే కాదు... తన అమ్మ, అమ్మమ్మ గుర్తుగా ఇచ్చిన డైమండ్ పొదిగిన బంగారు లాకెట్ కూడా ఉంది. అవన్నీ చూసిన తర్వాత కూడా డ్రైవర్ ఎంతో నిజాయతీగా తీసుకెళ్లి బ్యాగును తిరిగి ఇచ్చేశాడు. ఈ అనుభవం తన స్నేహితురాలికి ఎదురైందంటూ అర్నవ్ దేశ్‌ముఖ్ అనే వ్యక్తి లింక్డ్‌ఇన్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
తన స్నేహితురాలు మధ్యాహ్నం 1 గంటల సమయంలో ఆటో ఎక్కిందని, డ్రైవర్‌కు యూపీఐ పేమెంట్ చేసిన ఆమె అనుకోకుండా తన పర్సును ఆటోలో మరచిపోయిందని చెప్పారు. ‘‘బ్యాగు పోయిందని గుర్తించిన తర్వాత ఆమెతో పాటు ఇంట్లో వాళ్లందరూ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. రికవరీ కోసం ప్రయత్నించారు. యూపీఐ మెసెంజర్ ద్వారా డ్రైవర్‌ను సంప్రదించడానికి ప్రయత్నించారు. కానీ అతడు రెస్పాండ్ కాలేదు. దీంతో వారు గురుగ్రామ్ పోలీసులకు సమాచారం అందించారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. సాయంత్రం 4 గంటల సమయంలో పోలీసులు ఆటోని ట్రాక్ చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రయత్నాలు కొనసాగుతుండగానే ఒక గంట తర్వాత ప్రాపర్టీ మేనేజర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. మణిరుల్ జమాన్ అనే ఆటో డ్రైవర్ బ్యాగును తీసుకొచ్చి ఇచ్చాడని సమాచారం అందించారు. బ్యాగ్‌లోని డైమండ్ లాకెట్ తో పాటు ప్రతి ఒక్క వస్తువు చెక్కుచెదరకుండా ఉన్నాయని చెప్పడంతో నా స్నేహితురాలు, కుటుంబ సభ్యులు, మేమందరం ఎగిరి గంతేశాం. చాలా సంతోషంగా భావించాం’’ అని అర్నవ్ దేశ్‌ముఖ్ రాసుకొచ్చారు.
‘‘ఈ విషయంలో నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి. మా అందరి మనస్సులకు గొప్ప ఉపశమనం దక్కింది. బ్యాగ్‌లో ఉన్నవన్నీ యథాతథంగా అప్పగించి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఈ పరిణామంతో గురుగ్రామ్ వంటి ప్రధాని శ్రేణి నగరాల్లో కూడా దేవుడు ఉన్నాడని, మానవత్వం ఉందనే మా విశ్వాసం మరింత బలపడింది’’ అని అర్నవ్ వ్యాఖ్యానించారు.
కాగా ఇంత నిజాయితీగా వ్యవహరించిన ఆటో డ్రైవర్ మణిరుల్ జమాన్‌పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇలాంటి ఘటనలు సమాజాన్ని మేలుకొలుపుతాయని వ్యాఖ్యానిస్తున్నారు. ‘‘మంచి వ్యక్తులు ఉన్నారు. ప్రపంచాన్ని మంచి ప్రదేశంగా మార్చే నిశ్శబ్ద హీరోలు వారు’’ అని ఓ వ్యక్తి వ్యాఖ్యానించారు.