Kolkata Horror: మమత అబద్ధం చెబుతున్నారు.. మాకు డబ్బు ఆశ చూపారు.. కోల్‌కతా వైద్యురాలి తల్లిదండ్రులు
- బాధితురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలను ఖండించిన మమత
- తమ ప్రభుత్వంపై అపవాదు వేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపాటు
- ఆందోళనలు ఆపాలన్న మమత పిలుపు అమానవీయమన్న బాధిత తల్లిదండ్రులు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కోల్‌కతా ట్రైనీ వైద్యురాలి తల్లి సంచలన ఆరోపణలు చేశారు. మమత అబద్ధం ఆడుతున్నారని, తమకు పరిహారం ఇవ్వజూపారన్నది వాస్తవమని పేర్కొన్నారు. బాధిత వైద్యురాలి తల్లిదండ్రులకు పోలీసులు లంచం ఇవ్వబోయారన్న ఆరోపణలను ఖండించిన మమత.. తమ ప్రభుత్వాన్ని అపవాదుపాలు చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మమత వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన బాధిత వైద్యురాలి తల్లి మాట్లాడుతూ.. ‘‘ముఖ్యమంత్రి అబద్ధం చెబుతున్నారు. మీకు పరిహారం అందుతుందని మాతో చెప్పారు. మీ కుమార్తె జ్ఞాపకార్థం ఏదైనా నిర్మించుకోవచ్చని అన్నారు. మా కుమార్తెకు న్యాయం జరిగినప్పుడు, నేనే మీ కార్యాలయానికి వచ్చి పరిహారం తీసుకుంటానని చెప్పాను’’ అని పేర్కొన్నారు. అంతేకాదు, అత్యాచారం, హత్యకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలను అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఆందోళనలు విరమించి రానున్న దుర్గా పూజలకు సిద్ధం కావాలంటూ మమత ఇచ్చిన పిలుపును అమానవీయంగా ఆమె అభివర్ణించారు. ఓ బిడ్డను కోల్పోయిన తల్లిగా తనకు ఆ పిలుపు అమానవీయంగానే కనబడిందని, దేశవ్యాప్తంగా ప్రజలు దుర్గాపూజ చేసుకోవాలంటే చేసుకోవచ్చని పేర్కొన్నారు.