Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళన.. వీడియో ఇదిగో!
- కూర్మన్నపాలెం వద్ద రాస్తారోకో
- స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆందోళన
- విశాఖ ఉక్కును సెయిల్ లో విలీనం చేయాలని డిమాండ్
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరును నిరసిస్తూ కార్మికులు మంగళవారం ఆందోళన చేపట్టారు. విశాఖపట్టణంలోని కూర్మన్నపాలెంలో రాస్తారోకో నిర్వహించారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ, నిర్వాసితులతో పాటు వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో హైవేపై బైఠాయించారు. దీంతో విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష పార్టీలు ఆందోళన చేపట్టాయి. ఈ సందర్భంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికుల జేఏసీ లీడర్లు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కును వెంటనే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
కార్మికులు, నిర్వాసితుల ఆందోళనలతో కూర్మన్నపాలెంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని నిరసనకారులతో చర్చలు జరిపారు. ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నేతలకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. విశాఖ ఉక్కు పరిరక్షణ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో తమకు ఇచ్చిన హామీలను రెండు నెలలు గడిచినా అమలు చేయలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.