Anitha: అదే జరిగి ఉంటే లక్షల మంది ప్రాణాలు పోయేవి: అనిత

Anitha press meet on boats hitting Prakasam Barrage
  • ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకొచ్చేటట్టు చేశారన్న అనిత
  • ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా సిద్ధమయ్యారని మండిపాటు
  • అలాంటి వారిని దేశద్రోహులుగా పరిగణించాలని వ్యాఖ్య
ప్రకాశం బ్యారేజీకి బోట్లు కొట్టుకు రాలేదని, కొట్టుకు వచ్చేటట్టు చేశారని ఏపీ హోం మంత్రి అనిత అన్నారు. బ్యారేజీని ఢీకొన్న ఐదు బోట్లు ప్రమాదవశాత్తు రాలేదని... ఇది మేన్ మేడ్ ఇన్సిడెంట్ అని చెప్పారు. తొలుత బోట్లు కొట్టుకొచ్చాయనే అనుకున్నామని... కానీ ఘటనపై విచారణ జరిపించిన తర్వాత షాకింగ్ విషయాలు తెలిశాయని అన్నారు. 

చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు కుట్ర చేశారని... ఇందులో భాగంగా విధ్వంసం సృష్టించేందుకు, ప్రజల ప్రాణాలు తీసేందుకు కూడా వాళ్లు సిద్ధమయ్యారని... అలాంటి వాళ్లను దేశద్రోహులుగా పరిగణించాలని అన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టాలని ఎవరనుకుంటున్నారనే విషయంపై ప్రజలు కూడా చర్చించుకోవాలని సూచించారు.   

సాధారణంగా బోట్ల వెయిట్ ని, సైజును బట్టి వాటిని కడతారని... పెద్ద బోట్లను ఐరన్ వైర్లతో కడతారని అనిత చెప్పారు. చిన్నచిన్న బోట్లను కూడా ఒకదానికొకటి కట్టరని... ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగిలినవి కూడా కొట్టుకుపోతాయని అన్నారు. అలాంటిది 40 నుంచి 50 టన్నుల బరువుండే మూడు పెద్ద బోట్లను నైలాన్ తాడుతో కట్టారని చెప్పారు. ఉద్ధండరాయునిపాలెం రేవులో ఉండాల్సిన ఈ బోట్లు ఇక్కడకు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

ఈ బోట్లు కౌంటర్ వెయిట్లను తాకడంతో ప్రమాదం తప్పిందని... అదే డ్యామ్ పిల్లర్లను తాకి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని... లక్షలాది మంది ప్రాణాలు పోయేవని అనిత ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని ఏం చేయాలని ప్రశ్నించారు. ఈ బోట్ల యజమానులు వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం అనుచరులని చెప్పారు. బోట్లు ఢీకొన్న ఘటన వెనుక ఇంకా ఏయే కోణాలున్నాయో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.
Anitha
Telugudesam
Prakasam Barrage

More Telugu News