Chandrababu: ఇక ఉత్తరాంధ్ర వెళ్లనున్న సీఎం చంద్రబాబు
- బంగాళాఖాతంలో వాయుగుండం
- ఉత్తరాంధ్రను వణికించిన భారీ వర్షాలు
- విరిగిపడిన కొండచరియలు
- ఉగ్రరూపం దాల్చిన నదులు, వాగులు
విజయవాడలో 10 రోజులుగా వరద బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తూ, సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తూ అలుపెరగకుండా శ్రమించిన సీఎం చంద్రబాబు ఇక ఉత్తరాంధ్ర వెళ్లనున్నారు. ఉత్తరాంధ్రలో వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రేపటి నుంచి పర్యటించనున్నారు.
వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రను భారీ వర్షాలు వణికించిన సంగతి తెలిసిందే. నదులు... ఇతర వాగుల పరవళ్లు ఉగ్రరూపం దాల్చాయి. పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయి, గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంట నీట మునిగింది.
విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలకు జలాశయాల్లో నీటి మట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో కొండచరియలు విరిగిపడడంతో పలు నివాస గృహాలు నేలమట్టం అయ్యాయి. కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
ఈ నేపథ్యంలో, సీఎం చంద్రబాబు ఇక తన దృష్టిని ఉత్తరాంధ్రపై సారించనున్నారు. అధిక వర్షాలతో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించనున్నారు. చంద్రబాబు ఏలేరు ప్రాజెక్టును కూడా పరిశీలించనున్నారు. ఎల్లుండి (సెప్టెంబరు 12) నందివాడ, కొల్లేరు ప్రాంత వరద బాధితులను పరామర్శించనున్నారు.