Best Countries: అత్యుత్తమ దేశాల జాబితాలో టాప్ ‘స్విట్జర్లాండ్’
- వరుసగా మూడోసారి, మొత్తంగా ఏడుసార్లు ఘనత
- 89 దేశాలకు ర్యాంకింగ్స్ ప్రకటించిన అమెరికా కంపెనీ
- టాప్ 25 లో ఐరోపా దేశాలు.. భారత్ కు 33వ ర్యాంకు
ప్రపంచ దేశాలలో అత్యుత్తమ దేశంగా ‘స్విట్జర్లాండ్’ మరోసారి నిలిచింది. బెస్ట్ కంట్రీస్ ర్యాంకింగ్స్ లో వరుసగా మూడోసారి నెంబర్ వన్ స్థానాన్ని నిలబెట్టుకుంది. అందమైన పర్యాటక ప్రాంతాలతో పాటు జీవన ప్రమాణం, నాణ్యత, సంస్కృతి తదితర అంశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో జనం స్విట్జర్లాండ్ కే జైకొట్టారు. ఈమేరకు అమెరికాకు చెందిన న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ సంస్థ ప్రపంచ దేశాల (89 దేశాల) తాజా ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది. స్విట్జర్లాండ్ వరుసగా మూడోసారి ఈ ఘనత సాధించగా.. మొత్తంగా ఏడుసార్లు ఈ జాబితాలో టాప్ లో నిలిచింది.
జీవన నాణ్యత, వ్యాపార అవకాశాల విభాగాల్లో స్విట్జర్లాండ్ ఉన్నత స్థానంలో, వారసత్వ రంగంలో అట్టడుగు స్థానంలో ఉంది. చాలా విభాగాల్లో టాప్ లో నిలవడంతో స్విట్జర్లాండ్ కు ఈ ఘనత దక్కింది. స్విట్జర్లాండ్ తర్వాతి స్థానంలో జపాన్, అమెరికా, కెనడా, ఆస్టేలియా దేశాలు నిలిచాయి. టాప్ 25లో ఐరోపా దేశాలు ఉండగా.. భారతదేశానికి 33వ ర్యాంకు దక్కింది. గతేడాదితో పోలిస్తే 3 స్థానాలు దిగజారింది.