CM Revanth: మీకు మీరుగా తప్పుకుంటేనే గౌరవం.. బడాబాబులకు సీఎం రేవంత్ హెచ్చరిక

Telangana CM Revanth Reddy Serious Warning To FarmHouse Owners
  • అక్రమ నిర్మాణాలను కూల్చేయడం తప్పదన్న సీఎం
  • కోర్టుల్లోనూ పట్టువిడవకుండా పోరాడతామని వెల్లడి
  • తెలంగాణ పోలీస్ అకాడమీ పాసింగ్ ఔట్ పరేడ్ లో సంచలన వ్యాఖ్యలు
అక్రమ నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కూల్చివేత తప్పదని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రాజెక్టుల వద్ద ఫాంహౌస్ లు కట్టుకుంటూ డ్రైనేజీని గండిపేటలో కలుపుతున్నారని ఆరోపించారు. అలాంటి వాళ్లు అక్రమ నిర్మాణాల నుంచి తమకు తాముగా తప్పుకుంటే గౌరవంగా ఉంటుందని చెప్పారు. నిబంధనలను బేఖాతరు చేస్తూ కట్టిన నిర్మాణాలను కూల్చివేయడం తప్పదన్నారు. వాటిపై కోర్టుకు వెళ్లినా విడిచిపెట్టే సమస్యేలేదని, న్యాయస్థానాల్లోనూ పోరాడతామని స్పష్టం చేశారు. 

బుధవారం తెలంగాణ పోలీసు అకాడమీలో నిర్వహించిన పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలాలను ఆక్రమించుకోవడంతో వరదలు వచ్చి పేదల ఇళ్లు నీటమునుగుతున్నాయని అన్నారు. చెరువులు, నాలాలను ఆక్రమించి కట్టిన వాటిని తొలగించేందుకే హైడ్రాను ఏర్పాటు చేశామని వివరించారు. చెరువులను పూర్వ స్థితిలోకి తీసుకెళ్లేందుకు కృతనిశ్చయంతో ఉన్నామని చెప్పారు. ఆక్రమణలు తొలగించి మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి చేస్తామన్నారు. మూసీ పరీవాహక ప్రాంతంలోని 11 వేల మంది నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. 

ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చాం..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పై నిరుద్యోగులకు ప్రస్తుతం ఎలాంటి అనుమానాలు లేవని రేవంత్ రెడ్డి చెప్పారు. కమిషన్ పారదర్శకంగా పనిచేస్తోందని, వరుసగా నోటిఫికేషన్లు జారీ చేసి నియామకాలను వివాదరహితంగా పూర్తిచేస్తోందని వివరించారు. ఇప్పటికే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 35 వేల ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు.
CM Revanth
HYDRA
Farmhouse
Police Academy
TGPSC
Jobs
Govt Jobs

More Telugu News