Chandrababu: గత పాలకుల పాపాలు.. మనకు శాపాలు: చంద్రబాబు
- బుడమేరులో పూడిక తీయలేదు.. గుంతలు పూడ్చలేదని ఆరోపణ
- అందువల్లే విజయవాడకు కనీవినీ ఎరగని వరదలు వచ్చాయని వివరణ
- ప్రకాశం బ్యారేజీని ఢీ కొట్టిన బోట్లు వైసీపీ వాళ్లవేనని వెల్లడి
ఆంధ్రప్రదేశ్ లో గత వైసీపీ ప్రభుత్వం చేసిన పాపాలు మనకు ఇప్పుడు శాపాలుగా మారాయని సీఎం చంద్రబాబు ఆరోపించారు. బుడమేరు పట్ల నాటి సర్కారు వహించిన నిర్లక్ష్య ధోరణి విజయవాడకు ముప్పుగా పరిణమించిందని చెప్పారు. ఐదేళ్లలో ఒక్కసారి కూడా బుడమేరు పూడిక తీయలేదని, గండ్లు పూడ్చలేదని విమర్శించారు. దీంతో భారీ వర్షాలకు విజయవాడను కనీవినీ ఎరగని వరద ముంచెత్తిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
బుడమేరు వాగు పరిధిలో గత ప్రభుత్వం అక్రమార్కులను ప్రోత్సహించిందని, అక్రమ కట్టడాలకు తప్పుడు దారిలో అనుమతులిచ్చిందని వివరించారు. కుండపోత వర్షాలు, వరదలకు వాతావరణ మార్పులు కారణమని చెప్పారు. అయితే, ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వరదల ప్రభావం తీవ్రంగా ఉంటుందన్నారు.
ఆ బోట్లు వాళ్లవే..
ఎన్నికల్లో ఓడించిన ప్రజలపై కక్ష తీర్చుకునే వైపుగా వైసీపీ నాయకులు పోతున్నారని చంద్రబాబు తీవ్ర ఆరోపణలు చేశారు. కృష్ణా నదిలో వదిలిపెట్టిన నాలుగు బోట్లు వైసీపీ వాళ్లవేనని చెప్పారు. ప్రకాశం బ్యారేజీని ధ్వంసం చేయడానికి ఆ పార్టీ వాళ్లు ఉద్దేశపూర్వకంగానే వాటిని నదిలో వదిలిపెట్టారని వివరించారు. ఆ బోట్లపై వైసీపీ రంగు ఉందన్న విషయం గుర్తుచేశారు. ఒకదానిని మరొకటి చైన్లతో కట్టి నదిలో వదిలి పెట్టడంతో అవి బ్యారేజీ గోడలను ఢీ కొట్టాయని, ఇప్పటికీ వాటిని బయటకు తీయడానికి అధికారులు శ్రమిస్తూనే ఉన్నారని చంద్రబాబు తెలిపారు.
ఆ బోట్లను ఇసుక అక్రమ రవాణాకు ఉపయోగించే వారని ఆరోపించారు. వైసీపీ లీడర్ జగన్ ఇప్పుడు మాట్లాడుతూ.. ఆ బోట్లు టీడీపీ వాళ్లవేనని తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని చంద్రబాబు మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీని కూల్చాలని కుట్ర చేశారని, దీని వెనక రాజకీయ లింకులు లేకుంటే ఒక్క నిమిషంలో నిందితులను ఏం చేయాలో అది చేసే వాడినని వివరించారు. రౌడీలు, గూండాలను తాను ఎన్నడూ సహించలేదని, సామాన్యులకు ఇబ్బంది కలిగించే వారిపట్ల తానెప్పుడూ కఠిన వైఖరినే అవలంబించానని చంద్రబాబు గుర్తుచేశారు.