Chandrababu: సభాముఖంగా రఘురామకృష్ణరాజును అభినందించిన సీఎం చంద్రబాబు
- ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన
- కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై రైతులతో సమీక్ష
- రఘురామ డ్రెయినేజిలను బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారని కితాబు
- ఇది ప్రజా చైతన్యానికి నిదర్శనం అని వెల్లడి
ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ ఉమ్మడి ప్రశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొల్లేరు, ఉప్పుటేరు, తమ్మిలేరు వరదలపై రైతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సభకు ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రఘురామను సీఎం చంద్రబాబు అభినందించడం విశేషం. ఎమ్మెల్యే అయిన తర్వాత రఘురామకృష్ణరాజు డ్రెయినేజిలను బ్రహ్మాండంగా బాగుచేశారని కితాబిచ్చారు. ఈ విషయంలో ప్రజలందరినీ చైతన్యవంతులను చేసి, నిధులు సేకరించి నియోజకవర్గంలో డ్రెయిన్ల అభివృద్ధికి పాటుపడుతున్నారని సభాముఖంగా ప్రశంసించారు. ఇది ప్రజాచైతన్యానికి నిదర్శనంలా నిలుస్తుందని అన్నారు.
గతంలో సాగునీటి సంఘాలను ఏర్పాటు చేసి, కాలువలు, డ్రెయిన్ల నిర్వహణను వాళ్లకే అప్పజెప్పామని చంద్రబాబు వెల్లడించారు. కానీ గత ప్రభుత్వంలో ఆ వ్యవస్థలను కూడా తీసేశారని ఆరోపించారు.
సాగునీటి సంఘాల ఎన్నికలు జరుపుదామని భావించేలోగా, వరదలు వచ్చాయని తెలిపారు. మళ్లీ సాగునీటి సంఘాలు వస్తాయని, వ్యవసాయ రంగానికి తోడ్పాటుగా ఉంటాయని స్పష్టం చేశారు.