Ayushman Bharat: 70 ఏళ్లు పైబడిన వారికందరికీ ఆయుష్మాన్ భారత్.. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర క్యాబినెట్
- ప్రధాని మోదీ అధ్యక్షతన ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం
- ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స
- 6 కోట్ల మంది వృద్ధులకు ప్రయోజనకరం
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు ఢిల్లీలో కేంద్ర క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 70 ఏళ్లు, ఆ పైబడిన వారికి కూడా ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య పథకం వర్తింపజేయాలని నిర్ణయించారు.
ఆయుష్మాన్ భారత్ ద్వారా 6 కోట్ల మంది వృద్ధులకు లబ్ధి చేకూరనుంది. ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స అందించనున్నారు.
రూ.10,900 కోట్లతో పీఎం ఈ-డ్రైవ్ పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు పీఎం ఈ-డ్రైవ్ పథకాన్ని తీసుకువచ్చారు. పీఎం ఈ-డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా 88,500 చార్జింగ్ స్టేషన్లకు తోడ్పాటు లభించనుంది.
ఇక, జలవిద్యుత్ ప్రాజెక్టుల కోసం రూ.12,461 కోట్ల కేటాయింపునకు క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా 31,350 మెగావాట్ల ఉత్పత్తి లక్ష్యంగా క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.