Wayanad Disaster: వయనాడ్ విలయంలో 9 మందిని కోల్పోయిన శ్రుతి జీవితంలో మరో తీవ్ర విషాదం!

Shruti whose family was killed in Wayanad landslide loses fiance in car accident
  • వయనాడ్ ప్రకృతి విలయంలో తల్లిదండ్రులు, సోదరి సహా 9 మంది కుటుంబ సభ్యుల మృతి
  • ఆ సమయంలో ఆమెకు అండగా నిలిచిన ఒకే ఒక్కడు జెన్సన్
  • శ్రుతి కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకున్న చిరకాల మిత్రుడు
  • ఈ నెలలోనే పెళ్లి కావాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో జెన్సన్ మృతి
ఇటీవల సంభవించిన వయనాడ్ విలయంలో తల్లిదండ్రులు సహా 9 మంది కుటుంబ సభ్యులను కోల్పోయిన శ్రుతి జీవితంలో మరో గుండె కోత ఇది. వయనాడ్ జిల్లాలోని చురాల్‌మల్ గ్రామానికి చెందిన 24 ఏళ్ల శ్రుతికి జూన్ 2న తన చిరకాల మిత్రుడైన జెన్సన్ (27)తో వివాహ నిశ్చితార్థం జరిగింది. మతాంతరమైనా ఇరు కుటుంబాలు వీరి పెళ్లికి అంగీకరించాయి.

ఆ తర్వాత జూన్ 30న వయనాడ్‌లో సంభవించిన ప్రకృతి విలయం శ్రుతి జీవితాన్ని అతలాకుతలం చేసింది. వరదలు, కొండచరియల కారణంగా ఆమె తల్లిదండ్రులు, సోదరి సహా 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇంతటి క్లిష్ట సమయంలో ఆమెకు అండగా నిలిచిన ఒకే ఒక వ్యక్తి జెన్సనే. ఆమె కోసం ఉద్యోగాన్ని సైతం వదులుకొని అనుక్షణం ఆమె వెంటే ఉన్నాడు.

మోదీ పర్యటన సమయంలోనూ వీరిద్దరూ కలిసే మాట్లాడారు. జాతీయ మీడియాలోనూ వారి గురించి వార్తలొచ్చాయి. శ్మశాన వాటికలో కుటుంబ సభ్యులకు నివాళులు అర్పిస్తూ జీవితాంతం ఒకరికి ఒకరం తోడుంటామని బాసలు చేసుకున్నారు. ఈ నెలలో పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించారు.

మరో విషాదం
ప్రకృతి విలయంలో సర్వం కోల్పోయిన తరుణంలో జెన్సన్ రూపంలో దొరికిన అండ కూడా తాజాగా కోల్పోయింది శ్రుతి. ఈ నెల 10న శ్రుతి, జెన్సన్‌తోపాటు ఇతర కుటుంబ సభ్యులు వ్యానులో వెళ్తుండగా కోజికోడ్-కొల్లేగల్ జాతీయ రహదారిపై వీరి వ్యాన్-ప్రైవేటు బస్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో జెన్సన్‌ తీవ్రంగా గాయపడగా, మిగతా వారు స్వల్పంగా గాయపడ్డారు. తీవ్రంగా గాయపడిన జెన్సన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందాడు. ఉన్న ఒకే ఒక్క అండ కోల్పోవడంతో శ్రుతి ఇప్పుడు దిక్కులేనిదై విలపిస్తోంది.
Wayanad Disaster
Kerala
Shruti
Jensen

More Telugu News