Assam Online Trading Scam: రూ.2వేల కోట్ల ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణం.. నటి, ఆమె భర్త అరెస్టు!
- అస్సాంలో కలకలం సృష్టించిన ట్రేడింగ్ స్కామ్
- నటి సుమిబోరా, ఆమె భర్త తార్కిక్ బోరాను అదుపులోకి తీసుకున్న పోలీసులు
- ఈ కేసులో ఇప్పటికే విశాల్ పుకాన్ అరెస్టు
అస్సాంలో కలకలం సృష్టించిన రూ.2వేల కోట్ల ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్ కుంభకోణంలో గురువారం స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు నటి సుమిబోరాను అరెస్టు చేశారు. సుమిబోరాతో పాటు ఆమె భర్త తార్కిక్ బోరాను కూడా అదుపులోకి తీసుకున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.
పెట్టుబడి రెట్టింపు చేస్తామంటూ స్టాక్‌మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల పేరుతో కేటుగాళ్లు జనాల నుంచి భారీ ఎత్తున సొమ్మును సమీకరించారు. ఈ కుంభకోణం సుమారు రూ.2వేల కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇప్పటికే విశాల్ పుకాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఈయన 60 రోజుల్లో పెట్టుబడులపై 30 శాతం రాబడి వస్తుందని నమ్మబలికాడు. అలా భారీ మొత్తంలో దండుకుని అస్సాం చిత్ర పరిశ్రమలో పెట్టుబడులు పెట్టాడు. దీనికోసం నాలుగు నకిలీ సంస్థలను కూడా స్థాపించాడు.
ఈ స్కామ్‌లో బోరా దంపతులతో పాటు మరికొందరిపై ఆరోపణలు ఉన్నాయి. విశాల్ అరెస్టు తర్వాతే వీరిని పోలీసులు విచారణకు పిలిచారు. అయితే, బోరా దంపతులు హాజరుకాలేదు. దాంతో వీరిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. గురువారం వారిని అరెస్టు చేయడం జరిగింది.