Virat Kohli: 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. సచిన్ అరుదైన రికార్డుకు 58 పరుగుల దూరంలో కోహ్లీ!
- అంతర్జాతీయ క్రికెట్లో 27వేల రన్స్‌కు 58 పరుగుల దూరంలో విరాట్
- అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 27వేల రన్స్ చేసిన రికార్డు సచిన్ పేరిట
- ఈ రికార్డును 623 ఇన్నింగ్స్‌లో అందుకున్న మాస్టర్ బ్లాస్టర్
- ఇప్పటివరకు 591 ఇన్నింగ్స్‌లు ఆడి 26,942 పరుగులు చేసిన రన్‌మెషిన్
- తదుపరి 8 ఇన్నింగ్స్‌లలో 58 రన్స్ చేస్తే 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 27వేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా కోహ్లీ
క్రికెట్లో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ కొన్ని అద్భుత రికార్డులను నెలకొల్పారు. వాటిలో కొన్ని ఇప్పటికే బ్రేక్ అయ్యాయి. మరికొన్ని మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉండేలా ఉన్నాయి. అందులో 100 అంతర్జాతీయ శతకాలు. వర్తమాన క్రికెటర్లలో విరాట్ కోహ్లీ మాత్రమే 80 సెంచరీలతో సచిన్ రికార్డుకు దగ్గరగా ఉన్నాడు. 35 ఏళ్ల విరాట్ ఫిట్‌గా ఉంటే మరో రెండుమూడేళ్లు క్రికెట్లో కొనసాగుతాడు. పైగా ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పేశాడు. వన్డే, టెస్టు ఫార్మాట్లు మాత్రమే ఆడతాడు. మిగతా 20 శతకాలు ఈ రెండు ఫార్మాట్ల ద్వారా చేయాల్సి ఉంటుంది. ఇది కొంచెం కష్టం అనే చెప్పాలి.
అయితే, 147 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో తొలిసారి విరాట్ కోహ్లీ ఓ అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. మరో 58 పరుగులు చేస్తే క్రికెట్ గాడ్ సచిన్ నెలకొల్పిన ఈ రికార్డును అధిగమిస్తాడు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ టెస్ట్ సిరీస్‌లో రన్‌మెషిన్ ఈ రికార్డును అందుకునే అవకాశం ఉంది.
ఆ రికార్డు ఏంటంటే..
అంతర్జాతీయ క్రికెట్లో 27వేల పరుగులు పూర్తి చేసేందుకు కోహ్లీకి 58 పరుగులు అవసరం. అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 27వేల పరుగులు చేసిన రికార్డు సచిన్ పేరిట ఉంది. లిటిల్ మాస్టర్ ఈ రికార్డును 623 ఇన్నింగ్స్‌లో (226 టెస్టు ఇన్నింగ్స్‌లు, 396 వన్డే ఇన్నింగ్స్‌లు, ఒక టీ20 ఇన్నింగ్స్) అందుకున్నాడు.
ఇక కోహ్లి ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 591 ఇన్నింగ్స్‌లు ఆడి 26,942 పరుగులు చేశాడు. అతడు తన తదుపరి ఎనిమిది ఇన్నింగ్స్‌లలో 58 పరుగులు సాధించగలిగితే, 600 కంటే తక్కువ ఇన్నింగ్స్‌లలో 27వేల పరుగులు చేసిన మొదటి క్రికెటర్‌గా అవతరిస్తాడు.
కాగా, ఇప్పటివరకు సచిన్ టెండూల్కర్‌తో పాటు ఆస్ట్రేలియాకు చెందిన రికీ పాంటింగ్, శ్రీలంకకు చెందిన కుమార సంగక్కర అంతర్జాతీయ క్రికెట్లో 27వేల పరుగులకు పైగా సాధించారు.