Balakrishna: వాళ్ల పేర్లు ఎత్తడం కూడా అనవసరం: బాలకృష్ణ
- ఏపీలో వరద విలయం
- విరాళాలు ప్రకటించిన టాలీవుడ్ ప్రముఖులు
- చెక్ లు అందించేందుకు ఏపీకి వచ్చిన బాలయ్య, సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్
ఏపీలో వరదల బాధితులకు టాలీవుడ్ ఆపన్న హస్తం అందిస్తోన్న సంగతి తెలిసిందే. విజయవాడలో ముంపు బాధితులకు సినీ ప్రముఖులు భారీ విరాళాలు ప్రకటించారు. నందమూరి బాలకృష్ణ రూ.50 లక్షలు, సిద్ధు జొన్నలగడ్డ రూ.15 లక్షలు, విష్వక్సేన్ రూ.5 లక్షలు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా ప్రకటించారు.
కాగా, ఈ విరాళం తాలూకు చెక్ లు అందించేందుకు బాలయ్య, సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్ నేడు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టులో బాలకృష్ణను మీడియా పలకరించింది. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో వరదలు ప్రభుత్వ సృష్టి అని చెబుతున్నారని, ఇంతకంటే హాస్యాస్పదం ఉంటుందా? అని బాలయ్య వ్యాఖ్యానించారు. వరదలపై లేనిపోని రచ్చ చేశారని, వాళ్ల పేర్లు ఎత్తడం కూడా అనవసరమని అన్నారు. ఇంతకుమించి దీనిపై ఏమీ మాట్లాడలేమని పేర్కొన్నారు.
ఏపీలో వరద బాధితుల పరిస్థితి చూసి చలించిపోయి తాము విరాళాలు ప్రకటించామని, ఆ విరాళాన్ని ప్రభుత్వానికి అందించేందుకు నేడు రాష్ట్రానికి వచ్చామని బాలకృష్ణ వెల్లడించారు. యువ నటులు సిద్ధు జొన్నలగడ్డ, విష్వక్సేన్ వంటి వారు విరాళాలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయం అని వివరించారు.
గతంలో ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు నందమూరి తారకరామారావు గారు ప్రజల కోసం జోలె పట్టారని బాలకృష్ణ గుర్తు చేశారు. రాష్ట్రంలో ఒక ప్రాంతంలో విపత్తు సంభవిస్తే, అన్ని ప్రాంతాల వారిని ఏకం చేసి ఎన్టీఆర్ సాయపడేవారని వివరించారు.