Elecrtic vehicles: పీఎం ఈ-డ్రైవ్... కేంద్రం నుంచి కొత్త పథకం... వివరాలు ఇవిగో!
- విద్యుత్ ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు ఫస్ట్ టైమ్ గరిష్ఠంగా పది వేల సబ్సిడీ
- రెండో ఏడాది సబ్సిడీ రూ.5 వేలు
- విద్యుత్ వాహనాలను ప్రోత్సహించేందుకు పీఎం ఈ డ్రైవ్ పథకం
విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం కొత్తగా పీఎం ఈ – డ్రైవ్ పథకాన్ని తీసుకువచ్చింది. ఈ పథకం కింద విద్యుత్ ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు గరిష్ఠంగా పది వేల సబ్సిడీ లభించనుంది. రెండో ఏడాది ఆ మొత్తం రూ.5వేలకు పరిమితం అవ్వనుంది. దీనికి సంబంధించిన వివరాలను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి తెలిపారు.
ఫేమ్ స్థానంలో 14,335 కోట్లతో రెండు పథకాలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర వేసింది. ఇందులో పీఎం ఎలక్ట్రిక్ డ్రైవ్ రెవెల్యూషన్ ఇన్ ఇన్నోవేటివ్ వెహికల్ ఎన్ హాన్స్ మెంట్ (పీఎం ఇ – డ్రైవ్) పథకానికి రూ.10,900 కోట్లు కేటాయించారు. రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది. ఇదే తరహాలో ఇ రిక్షాలకు రూ.25వేలు, రెండో ఏడాది రూ.12,500 వంతున చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు.
ఈ పథకం కింద లబ్దిపొందాలంటే పీఎం ఈ – డ్రైవ్ పోర్టల్ లో ఆధార్ ఆధారిత ఈ – వోచరును జనరేట్ చేస్తారు. దానిపై కొనుగోలుదారులు, డీలర్ ఇద్దరూ సంతకాలు చేసి పోర్టల్ లో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. కొనుగోలుదాడుడు సెల్ఫీని కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.