Kollu Ravindra: కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట
- అమెరికా పర్యటనకు వెళుతున్న కొల్లు రవీంద్ర
- క్రిమినల్ కేసులు ఉండటంతో పాస్ పోర్టును పునరుద్ధరించని పాస్ పోర్ట్ అధికారులు
- పాస్ పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశం
ఏపీ మంత్రి కొల్లు రవీంద్రకు హైకోర్టులో ఊరట లభించింది. ఆయనపై ఉన్న క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా ఆయన పాస్ పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. ఈనెల 20న కొల్లు రవీంద్ర విదేశాలకు వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో తన పాస్ పోర్టును పునరుద్ధరించాలని పాస్ పోర్ట్ అధికారులను గతంలో రవీంద్ర కోరారు. అయితే రవీంద్రపై క్రిమినల్ కేసులు ఉండటంతో ఆయన పాస్ పోర్టును పునరుద్ధరించేందుకు అధికారులు నిరాకరించారు.
ఈ క్రమంలో రవీంద్ర నిన్న హైకోర్టును ఆశ్రయించారు. రవీంద్ర పిటిషన్ ను హైకోర్టు విచారించింది. క్రిమినల్ కేసులతో సంబంధం లేకుండా పాస్ పోర్టును పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 24 నుంచి 26 వరకు అమెరికాలో జరగనున్న 'మైన్ ఎక్స్ పో' కార్యక్రమంలో కొల్లు రవీంద్ర పాల్గొనాల్సి ఉంది. దీంతో పాస్ పోర్టు పునరుద్ధరణ కోసం హైకోర్టును రవీంద్ర ఆశ్రయించారు.
కొల్లు రవీంద్ర తరపున న్యాయవాది ఎంవీ రమణకుమారి వాదనలు వినిపించారు. క్రిమినల్ కేసులు పెండింగ్ లో ఉన్నాయనే కారణంగా పాస్ పోర్టును తిరస్కరించొద్దని సుప్రీంకోర్టు, హైకోర్టులు పలు సందర్భాల్లో తీర్పులిచ్చాయని ఆమె వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన వివరాలను సమర్పించాలని కేంద్ర హోంశాఖ, విజయవాడ ప్రాంతీయ కార్యాలయం పాస్ పోర్ట్ అధికారిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఈరోజుకు వాయిదా వేసింది. ఈరోజు పిటిషన్ ను విచారించిన హైకోర్టు పాస్ పోర్టును పునరుద్ధరించాలని ఆదేశించింది.