Arikepudi Gandhi: ఆంధ్రా-తెలంగాణ అంటావా... ఇది నీ బాబు సంపాదించిన తెలంగాణనా?: కౌశిక్ రెడ్డిపై అరికెపూడి గాంధీ నిప్పులు

Arikepudi Gandhi fires at Padi Koushik Reddy

  • కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చారని మండిపాటు
  • కౌశిక్ రెడ్డి మహిళలను అవమానించేలా మాట్లాడారన్న గాంధీ
  • కౌశిక్ రెడ్డి ఇంటికి వెళితే రాళ్లు, పూలకుండీలు విసిరారని ఆరోపణ
  • కేసీఆర్ అంటే ఇప్పటికీ గౌరవం ఉందన్న అరికెపూడి గాంధీ

ఆంధ్రా, తెలంగాణ అంటూ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చారని ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ మండిపడ్డారు. ఆయన ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... తన ఇంటికి వచ్చి జెండా ఎగురవేస్తానని కౌశిక్ రెడ్డి చెప్పారని, కానీ ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చే వ్యక్తితో తాను కలిస్తే తాను కూడా కౌశిక్ రెడ్డి లాంటి వాడినని సమాజం భావిస్తుందన్నారు. అయినప్పటికీ తాను కౌశిక్ రెడ్డిని తన ఇంటికి ఆహ్వానించానని... కానీ ఆయన రాలేదన్నారు. తానే అతని ఇంటికి వెళితే దాడి చేశారని ఆరోపించారు.

నీ అయ్య జాగీరా.. నీ బాబు సంపాదించిన తెలంగాణనా ఇది?

తనను వదిలిపెట్టేది లేదని కౌశిక్ రెడ్డి అంటున్నారని, కానీ నీ అయ్య జాగీరా... ఈ తెలంగాణ నీ బాబు సంపాదించిందా? అని మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి నిక్కర్ వేసుకోని రోజుల్లో తాను హైదరాబాద్ వచ్చానన్నారు. ఒక జూనియర్ ఎమ్మెల్యే తనలాంటి సీనియర్ ఎమ్మెల్యేపై ఇష్టారీతిన మాట్లాడటం సరికాదన్నారు. నాతో మాట్లాడేందుకు బీఆర్ఎస్‌లో నాయకులే లేరా? అని ప్రశ్నించారు. నాతో మాట్లాడేందుకు కౌశిక్ రెడ్డికి పదవి ఇచ్చిందా? అని ఎద్దేవా చేశారు. కౌశిక్ రెడ్డి రౌడీయిజం దేనికో చెప్పాలన్నారు.

కౌశిక్ రెడ్డి తన తీరును మార్చుకొని... క్రమశిక్షణతో ఎదగాలని సూచించారు. ఆంధ్రా, తెలంగాణ అనకుండా... నోరు మూసుకొని... రాష్ట్రం ఎదగడానికి సహకరించాలని కోరారు. చీరలు, గాజులు అంటూ మాట్లాడటం కాదని, తల్లి వద్ద కూర్చొని చరిత్ర వినాలని సూచించారు. ఇష్టారీతిన మాట్లాడవద్దని ఒక మిత్రుడిగా సలహా ఇస్తున్నానన్నారు. 

ఆంధ్రా, తెలంగాణ కుటుంబ సభ్యులు

తనది అక్రమ సంపాదన అని కౌశిక్ రెడ్డి అంటున్నారని, ఎక్కడో నిరూపించాలన్నారు. ఆయన రమ్మన్న చోటికి వెళతానని చెప్పారు. ఆంధ్రా, తెలంగాణ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నీ నోరు మూయిస్తా అని హెచ్చరించారు. తన వెనుక ఎవరూ లేరని... ఎవరూ తనకు మాటలు నేర్పించలేదని కౌశిక్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తాను తన నియోజకవర్గ ప్రజల శ్రేయస్సు కోసం పని చేస్తున్నానన్నారు.

కౌశిక్ రెడ్డి అందుకే గెలిచారు!

ఈటల రాజేందర్ హుజూరాబాద్‌తో పాటు గజ్వేల్‌లోనూ పోటీ చేశారని, ఆయన రెండుచోట్ల పోటీ చేసినందువల్ల హుజూరాబాద్‌పై ఎక్కువగా దృష్టి పెట్టలేకపోవడంతో కౌశిక్ రెడ్డి గెలిచారన్నారు. అయినప్పటికీ గెలుపు గెలుపే అన్నారు. కానీ కౌశిక్ రెడ్డి నోటి దురద వల్ల తాను ఈరోజు బయటకు రావాల్సి వచ్చిందన్నారు. ప్రాంతీయ విభేదాలు తీసుకువచ్చి ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తావా? అని కౌశిక్ రెడ్డిపై ధ్వజమెత్తారు.

కౌశిక్ రెడ్డి ప్రజలు, మహిళలను అవమానించేలా మాట్లాడారని మండిపడ్డారు. ఆయన తన తీరును మార్చుకోవాలని హితవు పలికారు. కౌశిక్ రెడ్డి తనను రెచ్చగొట్టినందువల్లే ఆయనపై తాను విమర్శలు చేయాల్సి వచ్చిందన్నారు. తన ఇంటికి వచ్చి కండువా కప్పుతానని కౌశిక్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కానీ తాను ఆయన ఇంటికి వెళితే రాళ్లు రువ్వారు... పూలకుండీలు విసిరారని ఆరోపించారు. మా పైనే బీఆర్ఎస్ వాళ్లు దాడి చేశారు... మేం ఒక్కరిపై కూడా దాడి చేయలేదు అని స్పష్టం చేశారు.

కేసీఆర్ అంటే ఇప్పటికీ గౌరవం

కేసీఆర్ అంటే తనకు ఇప్పటికీ గౌరవం ఉందని అరికెపూడి గాంధీ అన్నారు. ఆయన తనను ఆదరించారని... ఆశీర్వదించారని వ్యాఖ్యానించారు. కానీ కౌశిక్ రెడ్డి వంటి చీడపురుగుతో పార్టీకి మచ్చ వస్తోందన్నారు. అధికారం కోల్పోయామని ఆవేశపడి మాట్లాడటం సరికాదన్నారు. కౌశిక్ రెడ్డి వల్ల కేసీఆర్ గొప్ప మనస్తత్వం, గతంలో ఆయన చేసిన మంచి పనులకు చెడ్డపేరు వస్తుందన్నారు. నోరు అదుపులో లేని మనిషిని ఊరిమీదకు వదిలేశారన్నారు.


  • Loading...

More Telugu News