Shreyas Iyer: సన్‌గ్లాసెస్ ధరించి శ్రేయస్ బ్యాటింగ్... ఏడు బంతులాడి డకౌట్... ఆటాడుకుంటున్న నెటిజన్లు!
- దులీప్ ట్రోఫీలో పేలవ ఫామ్‌ను కొనసాగించిన శ్రేయస్ అయ్యర్
- ఫామ్‌లేమికి తోడు సన్‌గ్లాసెస్ ధరించి క్రీజులోకి బ్యాటర్
- డకౌట్ కావడంతో సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్స్
- కంటిచూపు సమస్య ఉంటే బ్యాటర్లు కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు పెట్టుకోవాలని సలహా
భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేయాలని చూస్తున్న శ్రేయస్ అయ్యర్ ప్రస్తుతం దులీప్ ట్రోఫీలో ఆడుతున్నాడు. ఇండియా-డీ జట్టు తరఫున ఆడుతున్న ఈ మిడిల్ ఆర్డర్ బ్యాటర్ తాజాగా డకౌట్ అయ్యాడు. రెండో రౌండ్ మ్యాచ్‌లో భాగంగా మొదటి ఇన్నింగ్స్‌లో 7 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు.
కాగా, క్రీజులోకి వచ్చిన అయ్యర్ సన్‌గ్లాసెస్ పెట్టుకుని బ్యాటింగ్ చేయడం గమనార్హం. దాంతో సోషల్ మీడియా వేదికగా అతనిపై విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి. కంటిచూపు సమస్య ఉంటే బ్యాటర్లు కాంటాక్ట్ లెన్సులు, కళ్లద్దాలు పెట్టుకుంటారు గానీ సన్‌గ్లాసెస్ కాదు అని ట్రోలింగ్ చేస్తున్నారు.
అటు తన మొదటి దులీప్ ట్రోఫీ మ్యాచ్‌లో అయ్యర్ తన రెండు ఇన్నింగ్స్‌లలో వరుసగా 9, 54 పరుగులు మాత్రమే చేశాడు. దాంతో బంగ్లాదేశ్‌తో మొదటి టెస్టుకు బీసీసీఐ సెలెక్టర్లు అయ్యర్‌ను పక్కన పెట్టారు. ఇక బంగ్లాతో జరిగే రెండో టెస్టుకు బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించలేదు. కానీ, అతని తాజా ప్రదర్శన మరోసారి నిరాశపరిచింది.
జాతీయ జట్టులో చోటు కోల్పోయి ఒత్తిడిలో ఉన్న అయ్యర్‌కు ఇటు దేశవాళీలోనూ ఫెయిల్యూర్స్ వెంబడిస్తున్నాయి. ప్రస్తుతం టీమిండియాలో ఈ బ్యాటర్‌కు ఏ ఒక్క ఫార్మాట్‌లో కూడా గ్యారెంటీ చోటు అంటూ లేకపోవడం గమనార్హం.