VG Venkata Reddy: ఏపీ గనులశాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డి కోసం ఏసీబీ గాలింపు
- గనులశాఖలో రూ. 2,500 కోట్ల మేర అక్రమాలు
- ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటరెడ్డి
- గురువారం కేసు నమోదైనప్పటి నుంచి అజ్ఞాతంలోకి
- ఏపీ, తెలంగాణతోపాటు చెన్నైలోనూ ఆయన కోసం గాలింపు
ఏపీలో ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ సన్నిహితుడు, గనుల శాఖ మాజీ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి కోసం ఏసీబీ అధికారులు విస్తృతంగా గాలిస్తున్నారు. గురువారం ఆయనపై కేసు నమోదు కాగా, అప్పటి నుంచి మూడు బృందాలు ఆయన కోసం వెతుకుతున్నాయి. ఏపీతోపాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడులోనూ ఆయన కోసం గాలిస్తున్నారు.
గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకు చెన్నై, తిరుపతి, అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు, కొర్లకుంట తదితర గ్రామాల్లోని ఆయన నివాసాలతోపాటు రైల్వే కోడూరులోని ఆయన అత్తగారి ఇంట్లోనూ సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇసుక కాంట్రాక్టు, నిర్వహణలో రూ. 2,500 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టు ఏసీబీ గుర్తించింది. కేసు నమోదైన వెంటనే వెంకటరెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో గనుల శాఖలో ఆయన సన్నిహితులను ఏసీబీ విచారించింది.