PM Modi: 42 ఏళ్లలో దోడాలో ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.. మోదీ అరుదైన ఘ‌న‌త‌!

PM Modi Mega Election Rally In Jammu and Kashmir Doda Today

  • ఇవాళ దోడా జిల్లాలో జరిగే మెగా ఎన్నిక‌ల‌ ర్యాలీలో పాల్గొన‌నున్న ప్ర‌ధాని 
  • 1982 త‌ర్వాత‌ దోడాలో ఓ ప్రధాన‌మంత్రి ప‌ర్య‌టించ‌డం ఇదే మొద‌టిసారి
  • జమ్మూ డివిజన్‌లోని మొత్తం 43 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తున్న బీజేపీ
  • సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 తేదీలలో జమ్మూ కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు

కట్టుదిట్టమైన భద్రతా మధ్య జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో జరిగే మెగా ఎన్నిక‌ల‌ ర్యాలీలో ఇవాళ‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన‌నున్నారు. ఈ ర్యాలీలో ప్రసంగించడం ద్వారా బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. కాగా, ఈ ఎన్నిక‌ల ర్యాలీలో పాల్గొన‌డం ద్వారా మోదీ అరుదైన ఘ‌న‌త సాధించ‌నున్నారు. గత 42 ఏళ్లలో దోడాలో ఓ ప్రధాని పర్యటించడం ఇదే తొలిసారి.

"ప్రధాని మోదీ శ‌నివారం దోడాలో తన మొదటి ఎన్నికల సమావేశాన్ని నిర్వహించనున్నారు. 42 సంవత్సరాలలో ఏ ప్రధానమంత్రి దోడాను సంద‌ర్శించ‌లేదు. ఇలా ఓ ప్ర‌ధాని 42 ఏళ్ల త‌ర్వాత మొదటిసారిగా దోడాలో ప‌ర్య‌టించ‌డం అనేది ఒక ముఖ్యమైన సంఘటన. 1982లో దోడాలో అప్ప‌టి ప్రధానమంత్రి (ఇందిరా గాంధీ) పర్యటించ‌డం జరిగింది" అని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, జమ్మూకశ్మీర్‌ బీజేపీ ఎన్నికల ఇంచార్జి కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

దోడా, కిష్త్వార్, రాంబన్-చీనాబ్ వ్యాలీలోని మూడు జిల్లాలలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు సెప్టెంబర్ 18న ఓటింగ్ జరగనుంది. దీంతో ఆయా ప్రాంతాల‌లోని బీజేపీ అభ్యర్థులకు మ‌ద్ద‌తుగా శ‌నివారం నాటి ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొన‌నున్నారు.

2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కిష్త్వార్ జిల్లాలో బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. అప్పటి నుండి దోడా ప్రజలు ప్రధానిని చూడటానికి, ఆయ‌న మాట‌లు వినడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని బీజేపీ నేత‌ ఒకరు చెప్పారు. ఇక తాజా ప్రధాని పర్యటన జ‌మ్మూలోని పార్టీ అభ్యర్థులకు ఎన్నికల్లో విజ‌యావకాశాలను పెంచ‌డం ఖాయ‌మ‌ని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

కాగా, జమ్మూ డివిజన్‌లోని మొత్తం 43 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. గత జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో ఆ పార్టీకి 25 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికలలో ఈ ప్రాంతం నుండి పార్టీ మొత్తం 25 స్థానాలను గెలుచుకుంది.
 
ఇక తాజా అసెంబ్లీ ఎన్నికలు మూడు ద‌శ‌ల్లో జ‌ర‌గ‌నున్నాయి. సెప్టెంబర్ 18, సెప్టెంబర్ 25, అక్టోబర్ 1 తేదీలలో ఓటింగ్ జర‌గ‌నుంది. ఫ‌లితాలు అక్టోబర్ 8న వెలువ‌డుతాయి. 10 సంవత్సరాలలో జమ్మూ కశ్మీర్‌లో ఇవే మొదటి అసెంబ్లీ ఎన్నికలు. అలాగే ఆర్టికల్ 370, 35A రద్దు త‌ర్వాత జ‌ర‌గ‌నున్న తొలి అసెంబ్లీ ఎన్నిక‌లు కూడా.

ఇదిలాఉంటే.. హోంమంత్రి అమిత్ షా గత శనివారం జమ్మూలో ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్ర‌సంగించిన విష‌యం తెలిసిందే. అలాగే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం రాంబన్ జిల్లాలో మరో ర్యాలీ నిర్వహించారు.

  • Loading...

More Telugu News