China: త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనరూ ప్లీజ్.. యువతీయువకులను వేడుకుంటున్న చైనా
- చైనాలో పెళ్లిళ్లపై విముఖత చూపుతున్న యువతీ యువకులు
- దేశంలో పెరిగిపోతున్న వృద్ధుల సంఖ్య
- రిటైర్మెంట్ వయసును పెంచే యోచన
ప్లీజ్.. త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనిపెట్టరూ.. అంటూ యువతీయువకులను చైనా ప్రభుత్వం వేడుకుంటోంది. దేశంలో జననాల రేటు పడిపోవడం, వృద్ధుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండడంతో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో చైనా ఇలా వేడుకుంటోంది. త్వరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనడంతోపాటు ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వారిని ఆలస్యంగా రిటైర్ కావాలని కూడా కోరుతోంది. తద్వారా పిల్లలు అందుబాటులోకి వచ్చే వరకు అంతరాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తోంది.
చైనా నిబంధనల ప్రకారం 22 ఏళ్లు దాటిన యువకులు, 20 ఏళ్లు నిండిన యువకులు మాత్రమే వివాహాలు చేసుకోవాలి. అయితే, పెరుగుతున్న ఖర్చులు, పిల్లల పోషణ భారం కావడంతో చాలామంది వివాహాలకు దూరంగా ఉంటున్నారు. వివాహం చేసుకున్నా పిల్లల్ని కనేందుకు విముఖత చూపుతున్నారు. దీంతో దేశంలో వృద్ధుల శాతం గణనీయంగా పెరిగిపోయింది.
ఇది ఇలాగే కొనసాగితే చైనా త్వరలోనే వృద్ధుల దేశంగా మారిపోయే ప్రమాదం ఉందన్న నేపథ్యంలో పెళ్లిళ్లపై ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోంది. అలాగే, రిటైర్మెంట్ వయసు పురుషులకు ప్రస్తుతం 60 ఏళ్లు ఉండగా దానిని 63 ఏళ్లకు, స్త్రీలకు 50 నుంచి 55 ఏళ్లకు పెంచాలని యోచిస్తోంది.