mathu vadalara 2: ఓటీటీ ఆదేశించింది... మైత్రీ పాటించింది.. హిట్ కొట్టింది!
- ఓటీటీ నిర్ణయించిన తేదీకి థియేటర్లోకి వచ్చిన చిత్రం
- వినోదాత్మక చిత్రంగా ప్రేక్షకుల ఆదరణ
- వరుస సెలవులతో మంచి వసూళ్లు
సాధారణంగా సినిమా విడుదల తేదీలను సదరు చిత్ర నిర్మాత, లేదా ఆ సినిమాను వివిధ ఏరియాల్లో పంపిణి చేసే పంపిణీదారులు కలిసి నిర్ణయిస్తారు. అయితే ప్రస్తుతం ట్రెండ్ మారింది. సినిమా విడుదల తేదీలను ఓటీటీ సంస్థలు నిర్ణయిస్తున్నాయి. తమ అనుకూల తేదీల్లో విడుదల చేస్తే ఆ సినిమా ఓటీటీ హక్కులు తీసుకుంటామని చెప్పడంతో నిర్మాతలు ఆ తేదీన సినిమాలు విడుదల చేయక తప్పడం లేదు. ఈ శుక్రవారం విడుదలైన మత్తువదలరా-2 చిత్రం విషయంలో కూడా ఇదే జరిగింది.
సింహా శ్రీ కోడూరి హీరోగా రితేష్ రానా దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు కలిసి నిర్మించిన చిత్రమిది. ఇదే బ్యానర్ నిర్మించిన మత్తు వదలరా చిత్రానికి ఇది సీక్వెల్. కాగా ఈ చిత్రం ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ కోనుగోలు చేసింది. అయితే సినిమాను తాము చెప్పిన తేదీన విడుదల చేస్తేనే హక్కులు తీసుకుంటామని షరతు విధించింది. దీంతో ఓటీటీ వాళ్లు నిర్ణయించిన సెప్టెంబరు 13న ఈ చిత్రాన్ని విడుదల చేశారు నిర్మాత చెర్రీ. అప్పటి వరకు సినిమా నిర్మించిన సంగతి కూడా ఎవరికి తెలియకుండా వుంచిన మైత్రీ సంస్థ.. సినిమా విడుదలకు పదిహేను రోజుల ముందే.. విడుదల తేదీని ప్రకటించి.. మంచి పబ్లిసిటితో సినిమాను ప్రేక్షకులకు రీచ్ అయ్యే విధంగా చేశారు.
ఈ శుక్రవారం విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకుంటోంది. పూర్తి వినోదాత్మక చిత్రంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. అంతేకాదు, వరుస సెలవులు కూడా రావడంతో సినిమా కలెక్షన్లు కూడా బాగున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా మల్టీప్లెక్స్‌ల్లో హౌస్‌ఫుల్స్ అవుతున్నాయి. ఏది ఏమైనా ఓటీటీ సంస్థ నిర్ణయించిన తేదీన సినిమా విడుదల చేసి మత్తువదలరా-2తో మంచి విజయాన్ని అందుకున్నాయి మైత్రీ అండ్ క్లాప్ బ్యానర్లు.