Somireddy Chandra Mohan Reddy: జగన్ చెప్పిందే కరెక్ట్: సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
- ఏలేరు వరదలు మ్యాన్ మేడ్ మిస్టేక్ అన్న జగన్
- కరెక్టే.. అది జగన్ మేడ్ మిస్టేక్ అన్న సోమిరెడ్డి
- వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లి ముద్దులు పెట్టారని విమర్శ
ఏలేరు వరదలు ప్రకృతి వైపరీత్యం కాదని, మ్యాన్ మేడ్ మిస్టేక్ అని వైసీపీ అధినేత జగన్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి స్పందిస్తూ... జగన్ చెప్పింది కరెక్ట్ అని అన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ ఏమీ చేయలేదని... కాబట్టి అది జగన్ మేడ్ మిస్టేక్ అని చెప్పారు.
భారీ వర్షాలతో ఏలేరు పొంగి ప్రవహించిందని... అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలతో ప్రాణనష్టం సంభవించలేదని సోమిరెడ్డి అన్నారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు 17 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తేనే కాకినాడ వరకు నీళ్లు వెళ్లాయని... ఇప్పుడు 42 వేల క్యూసెక్కుల నీరు వచ్చినా ముందు చూపుతో నష్టాన్ని నివారించగలిగామని చెప్పారు.
జగన్ కు క్యూసెక్కులు, టీఎంసీలు అంటే తెలియదని... ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో అంటే తెలియదని సోమిరెడ్డి ఎద్దేవా చేశారు. ప్యాలెస్ లో కూర్చొని జగన్ పాలించారని... ఆయన హయాంలో ఇరిగేషన్, వ్యవసాయ శాఖలు నిర్వీర్యం అయిపోయాయని విమర్శించారు. అప్పటి జలవనరుల శాఖ మంత్రి డ్యాన్సులకు పరిమితమయ్యారని దుయ్యబట్టారు.
వరద బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన జగన్ ముద్దులు పెడుతున్నారని విమర్శించారు. కేవలం వైసీపీ అనుచరులు ఉన్న ప్రాంతంలోనే జగన్ పర్యటించారని ఎద్దేవా చేశారు.