Jr NTR: మృత్యుముఖంలో ఉన్న అభిమానికి జూనియర్ ఎన్టీఆర్ వీడియో కాల్

Junior NTR video call to fan suffering with bone cancer
  • ప్రాణాంతక బోన్ క్యాన్సర్ తో బాధపడుతున్న కౌశిక్
  • ఇటీవల మీడియా ముందుకు వచ్చిన కౌశిక్ తల్లిదండ్రులు
  • తమ కుమారుడి ఆఖరి కోరిక ఏంటో చెప్పిన వైనం
ప్రాణాంతక క్యాన్సర్ తో బాధపడుతున్న ఓ అభిమాని చివరి కోరిక తెలుసుకుని యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ చలించిపోయారు. ఆ వీరాభిమాని పేరు కౌశిక్. కౌశిక్ వయసు 19 ఏళ్లే. కానీ విధి అతడి జీవితాన్ని తారుమారు చేసింది. కొంత కాలంగా అతడు బోన్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. 

ఇటీవల ఆ కుర్రాడి తల్లిదండ్రులు తిరుపతిలో మీడియా ముందుకు వచ్చి, తమ కుమారుడి చివరి కోరిక ఏంటో చెప్పారు. చనిపోయేలాగా ఎన్టీఆర్ దేవర సినిమా చూడాలన్నదే తమ కుమారుడి ఆఖరి కోరిక అని, దేవర సినిమా చూసేంతవరకైనా తనను బతికించాలని తమ కుమారుడు డాక్టర్లను వేడుకుంటున్నాడని చెప్పి ఆ తల్లిదండ్రులు భోరున విలపించారు. 

కాగా, తన అభిమాని పరిస్థితి తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్ వెంటనే స్పందించారు. తాజాగా కౌశిక్ కు వీడియో కాల్ చేసి అతడిని సంతోషసాగరంలో ముంచెత్తారు. నువ్వు ఎప్పుడూ నవ్వుతూనే ఉండాలి... నవ్వుతుంటే చక్కగా ఉన్నావు అని ఎన్టీఆర్ తన అభిమాని కౌశిక్ లో ఆత్మవిశ్వాసం నింపేందుకు ప్రయత్నించారు. 

మీతో మాట్లాడతానని అసలు అనుకోలేదు అని కౌశిక్ చెప్పగా... భలేవాడివే, అభిమానులతో మాట్లాడకుండా ఎలా ఉంటాను? అని ఎన్టీఆర్ బదులిచ్చారు. ఎలా ఉన్నావంటూ కౌశిక్ ఆరోగ్య పరిస్థితిపై ఎన్టీఆర్ అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్ ను జయించి రావాలని పేర్కొన్నారు. సినిమా సంగతి తర్వాత... ముందు నీ ఆరోగ్యం బాగుపడాలి... మీ అమ్మానాన్నలను చూసుకోవాలి అని ఆకాంక్షించారు. 

కాగా, కౌశిక్ తల్లిదండ్రులు తిరుపతి మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తమ కుమారుడి వైద్యం కోసం రూ.60 లక్షలు ఖర్చు అవుతుందని... ప్రభుత్వం, దాతలు పెద్దమనసుతో ముందుకు వచ్చి సాయం చేయాలని కన్నీళ్లతో విజ్ఞప్తి చేశారు.
Jr NTR
Kaushik
Cancer
Video Call
Tirupati
Devara
Tollywood

More Telugu News