Jammu And Kashmir: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కమాండర్‌ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు
- ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో తెగబడుతున్న ఉగ్రవాదులు
- ముగ్గురు టెర్రరిస్టులను హతమార్చిన భద్రతా బలగాలు
- ఇద్దరు జవాన్ల వీర మరణం
జమ్మూకశ్మీర్‌లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎన్నికల పర్యటన నేపథ్యంలో ఉగ్రవాదులు చెలరేగిపోతున్నారు. గత 24 గంటల వ్యవధిలో మూడు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. బారాముల్లాలో ముగ్గురు ముష్కరులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇద్దరు జవాన్లు అమరులయ్యారు. తాజాగా ఈ తెల్లవారుజామున ఫూంచ్ జిల్లాలో ఓ ఉగ్రవాద గ్రూపునకు చెందిన టాప్ కమాండర్, ఇద్దరు టెర్రరిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి.
గత రాత్రి ఈ ప్రాంతంలో వీరు నక్కినట్టు సమాచారం అందుకున్న ఆర్మీ గాలింపు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో మెందహార్‌లోని పథనాతీర్ వద్ద భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు ఎదురు కాల్పులు ప్రారంభించాయి. ప్రస్తుతం ఎన్‌కౌంటర్ కొనసాగుతోంది. కాగా, గత 42 ఏళ్లలో భారత ప్రధాని జమ్మూకశ్మీర్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లడం ఇదే తొలిసారి.