Virat Kohli: విరాట్ కోహ్లీ సహా ఎంతోమంది నా సారథ్యంలో ఆడారు.. తేజస్వీ యాదవ్ వ్యాఖ్యలు వైరల్

Virat Kohli player under my captaincy Says Tejashwi Yadav
  • 2009లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన తేజస్వీయాదవ్
  • 2010లో తొలి లిస్ట్ ఏ మ్యాచ్ ఆడిన ఆర్జేడీ నేత
  • 2008 నుంచి 2012 వరకు ఐపీఎల్‌లో ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం
ఆర్జేడీ నేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వీ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన తన క్రికెట్ అనుభవాలను పంచుకుంటూ.. క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ దేశవాళీ క్రికెట్‌లో తన సారథ్యంలోనే ఆడాడని గుర్తుచేసుకున్నారు. ప్రస్తుత భారత జట్టులో కొనసాగుతున్న ఎంతోమంది ఆటగాళ్లు తన బెంచ్‌మేట్సేనని చెప్పుకొచ్చారు. 

తేజస్వీయాదవ్ తన కెరియర్‌లో ఒకే ఒక ఫస్ట్‌క్లాస్ మ్యాచ్, రెండు లిస్ట్ ఏ మ్యాచ్‌లు, నాలుగు టీ20లు ఆడారు. దేశవాళీ క్రికెట్‌లో ఝార్ఖండ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. నవంబర్ 2009లో ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టిన తేజస్వీ విదర్భతో తొలి మ్యాచ్ ఆడారు. ఫిబ్రవరి 2010లో తొలి లిస్ట్ ఏ మ్యాచ్‌ను త్రిపుర, ఒరిస్సాతో ఆడారు. ఒరిస్సా, అస్సాం, బెంగాల్, త్రిపురతో నాలుగు టీ20లు ఆడారు. 

‘జీ మీడియా’కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తేజస్వి మాట్లాడుతూ.. క్రికెటర్‌గా తనను ఎవరూ గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నేనో క్రికెటర్‌ను. దాని గురించి ఎవరూ మాట్లాడడం లేదు. విరాట్ కోహ్లీ నా కెప్టెన్సీలో ఆడాడు. ఎవరైనా దాని గురించి మాట్లాడారా? ఎందుకలా? నేను మంచి క్రికెట్ ఆడాను. ప్రస్తుత టీమిండియా ఆటగాళ్లలో ఎంతోమంది నా బెంచ్‌మేట్లే’’ అని తేజస్వి గుర్తు చేసుకున్నారు. తన రెండు కాళ్లకు గాయాలు కావడంతోనే క్రికెట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని వివరించారు.

తేజస్వీ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తేజస్వీ యాదవ్ 2008 నుంచి 2012 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఢిల్లీ డేర్ డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ కేపిటల్స్)కు ప్రాతినిధ్యం వహించారు. అయినప్పటికీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడే అవకాశం రాలేదు.
Virat Kohli
Tejashwi Yadav
RJD
Lalu Prasad Yadav
Bihar
Team India

More Telugu News