cancer: క్యాన్సర్ ను కట్టడి చేసే కొత్త వ్యాక్సిన్... ఎలా పనిచేస్తుందంటే?
- తొలిదశ ప్రయోగాల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు
- రోగనిరోధక శక్తిని ఉత్తేజితం చేస్తున్న వ్యాక్సిన్
- క్యాన్సర్ కణాలను గుర్తించి, ఫైట్ చేసేలా ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించిన సైంటిస్టులు
క్యాన్సర్... ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రాణాలను హరిస్తున్న ఈ మహమ్మారికి ఇప్పటి వరకూ నిర్దిష్టమైన ఔషధమంటూ లేదు. రేడియేషన్ వంటి చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నప్పటికీ అవేవీ పూర్తిస్థాయిలో ఫలితాలు ఇవ్వడంలేదని వైద్య నిపుణులు చెబుతున్నారు. పైపెచ్చు వీటితో అనేక దుష్ప్రభావాలు ఉంటాయని చెప్పారు.
ఈ నేపథ్యంలోనే క్యాన్సర్ పై పోరాటానికి సరికొత్త వ్యాక్సిన్ ను ఇంగ్లాండ్ సైంటిస్టులు అభివృద్ధి చేశారు. ఈ వ్యాక్సిన్ ప్రభావాన్ని తెలుసుకునేందుకు చేస్తున్న తొలి దశ ప్రయోగాలలో ఆశ్చర్యకరమైన ఫలితాలు గుర్తించినట్లు చెప్పారు.
ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక క్యాన్సర్ మరణాలు గణనీయంగా తగ్గుతాయని, చికిత్సలో మెరుగైన ఫలితాలు వస్తాయని వివరించారు. ఈ వ్యాక్సిన్ కు వారు ఎంఆర్ఎన్ఏ–4359 అని నామకరణం చేశారు. ఈ వ్యాక్సిన్ తో పెద్దగా దుష్ప్రభావాలు ఉండవని చెప్పారు.
వ్యాక్సిన్ పనిచేసేది ఇలా...
లండన్ లోని కింగ్స్ కాలేజ్ లో ఎక్స్ పెరిమెంటల్ ఆంకాలజీలో క్లినికల్ రీడర్ గా వ్యవహరిస్తున్న డాక్టర్ దేబాశిష్ సర్కార్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఎంఆర్ఎన్ఏ–4359 వ్యాక్సిన్ మానవ శరీరంలోని సహజ రోగనిరోధక శక్తిని మరింత ఉత్తేజితం చేస్తుంది. క్యాన్సర్ కణాలను గుర్తించేందుకు తోడ్పడుతుంది. సాధారణ కణాలు, క్యాన్సర్ కణాలకు మధ్య తేడాను గుర్తించి, క్యాన్సర్ కణాలను ఎదగకుండా అడ్డుకునేలా చేస్తుంది.
అంతేకాదు, కొత్త క్యాన్సర్ కణాలు పుట్టుకు రాకుండా అడ్డుకుంటుంది. క్యాన్సర్ కణాలు శరీరంలో వేగంగా విస్తరించి కణుతులుగా ఏర్పడతాయి. దీనిని అడ్డుకోవడానికి రోగ నిరోధక శక్తిని ఈ వ్యాక్సిన్ ప్రోత్సహిస్తుంది. తద్వారా క్యాన్సర్ ను నిర్మూలించడానికి ఈ వ్యాక్సిన్ ఓ కొత్త మార్గాన్ని చూపుతుంది. క్యాన్సర్ చికిత్సలో కొత్త మందుల ఆవిష్కరణకు ఈ వ్యాక్సిన్ ఓ ముందడుగు అని డాక్టర్ దేబాశిష్ సర్కార్ చెప్పారు.