KL Rahul: ఆర్సీబీలోకి కేఎల్ రాహుల్?.. వైరల్ అవుతున్న స్టార్ ప్లేయర్ సమాధానం!
- గతకొంత కాలంగా కేఎల్ రాహుల్ ఎల్ఎస్జీని వీడుతున్నట్లు జోరుగా ప్రచారం
- ఆ వార్తలకు బలం చేకూరుస్తున్న అతడి తాజా వ్యాఖ్యలు
- మీరు మళ్లీ ఆర్సీబీకి ఆడితే చూడాలని ఉందన్న ఫ్యాన్
- 'అలానే ఆశిద్దాం' అంటూ బదులిచ్చిన స్టార్ బ్యాటర్
ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 మ్యాచ్ సందర్భంగా లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) యజమాని సంజీవ్ గోయెంకాతో కేఎల్ రాహుల్ చేసిన చాట్ ఫ్రాంచైజీలో అతని భవిష్యత్తుపై సందేహాలను లేవనెత్తింది. అయితే, రాహుల్ తన కుటుంబంలో భాగమని గోయెంకా ఇటీవల పేర్కొన్నప్పటికీ, జట్టు నుండి ఈ స్టార్ బ్యాటర్ వైదొలిగే అవకాశం ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఇక 2025 సీజన్‌కు ముందు మెగా వేలం జరగనున్న విషయం తెలిసిందే. దీంతో రాహుల్ తన పాత జట్లలో ఒకటైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) లోకి వెళ్లే అవకాశం ఉందని పుకార్లు షికారు చేస్తున్నాయి. 2013 నుంచి 2016 వరకు నాలుగు సీజన్లు ఆ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు ఈ స్టార్ ఆటగాడు.
దీంతో వచ్చే సీజన్లో ఎల్ఎస్జీ కెప్టెన్ రాహుల్ బెంగళూరులోకి వెళ్లడం ఖాయమని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ వార్తలకు తాజాగా అతడి వ్యాఖ్యలు బలం చేకూరుస్తున్నాయి. రాహుల్ ఇటీవల ఆర్సీబీ అభిమానితో ఇంటరాక్ట్ అయ్యాడు. ఈ సందర్భంగా అతను ఇచ్చిన సమాధానం ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఆ ఫ్యాన్ అతడిని 'మీరు మళ్లీ ఆర్సీబీకి ఆడితే చూడాలని ఉంది' అని అడిగాడు. అందుకు రాహుల్ 'అలానే ఆశిద్దాం' అని చెప్పడం వీడియోలో ఉంది. దాంతో ఎల్ఎస్జీలో కొనసాగే అవకాశం ఉంటే రాహుల్ ఈ విధంగా రిప్లై ఇచ్చేవాడు కాదని, ఆర్సీబీలోకి వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐపీఎల్ అభిమానులు అంటున్నారు.
ఇదిలాఉంటే.. గత నెలలో జహీర్ ఖాన్‌ను ఎల్ఎస్జీ ఫ్రాంచైజీ తమ టీమ్ మెంటార్‌గా నియమించుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గురించి తలెత్తిన ప్రశ్నకు యజమాని గోయెంకా తనదైన శైలిలో బదులిచ్చారు.
"గత మూడు సంవత్సరాలుగా రాహుల్‌ను క్రమం తప్పకుండా కలుస్తున్నాను. ఈ సమావేశంలో అతని గురించి ప్రశ్న ఎదురుకావడం నన్న ఆశ్చర్యపరుస్తోంది. ప్లేయర్లను అంటిపెట్టుకునే పూర్తి నిబంధనలు వెలువడే వరకు మేము ఎలాంటి నిర్ణయం తీసుకోలేం. కానీ రాహుల్ ప్రారంభం నుండి ఎల్ఎస్జీ ఫ్యామిలీలో అంతర్భాగంగా ఉన్నాడు. జట్టు నిర్మాణంలో అతను చాలా ముఖ్యమైన పాత్ర పోషించాడు. అతను మా కుటుంబ సభ్యుడిలాంటివాడు. మా ఫ్యామిలీతోనే ఉంటాడు" అని గోయెంకా విలేకరులతో అన్నారు.
అటు రాహుల్ రిటెన్షన్, కెప్టెన్సీ గురించి అడిగినప్పుడు గోయెంకా మాట్లాడుతూ, 'రిటెన్షన్‌కు సంబంధించిన నిబంధనలను బీసీసీఐ విడుదల చేయాలి. మేము దానికోసం వేచి ఉన్నాం" అని చెప్పాడు. దానికి ఇంకా చాలా సమయం ఉందని చెప్పుకొచ్చాడు.