KTR: తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట రాహుల్ గాంధీ తండ్రిది పెడతారా?: కేటీఆర్
- స్వపరిపాలన సౌధం ముందు స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా? అని ఆగ్రహం
- తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తల్లితో ఆటలాడతారా? అని నిలదీత
- కాంగ్రెస్ పార్టీని తెలంగాణ సమాజం క్షమించదన్న కేటీఆర్
తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టవలసిన చోట రాహుల్ గాంధీ తండ్రి విగ్రహాన్ని పెడతారా? అని రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు తుచ్ఛమైన, స్వార్థ రాజకీయాలకు తెరదీస్తారా? అని ధ్వజమెత్తారు.
'తెలంగాణ తల్లిని అవమానిస్తారా? తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా? తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా? తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా? తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా? తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా? తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా?' అని ప్రశ్నల వర్షం కురిపించారు.
నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టవలసిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం ఏమిటన్నారు. కాంగ్రెస్‌ను తెలంగాణ సమాజం ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు.
భట్టివిక్రమార్క గారూ... ఈ సమస్యను పరిష్కరించండి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉచిత కరెంట్ అన్నప్పుడు సుదీర్ఘంగా విద్యుత్ లేకుండా చేస్తారని ఊహించలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. సూర్యాపేట జిల్లా మామిళ్లగూడెంలో '16 రోజులుగా కరెంట్ కట్' అని పత్రికలో వచ్చిన క్లిప్పింగ్‌ను కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇక్కడ పదహారు రోజులుగా కరెంట్ లేదని, పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయనను ట్యాగ్ చేశారు. ఈ గ్రామంలో విద్యుత్‌ను వెంటనే పునరుద్దరించాలని భట్టివిక్రమార్కను కోరారు. విద్యుత్ అంతరాయాన్ని పరిష్కరించేందుకు 16 రోజులు తీసుకోవడం ఏ ప్రభుత్వానికీ సరికాదన్నారు.
రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడంపై క్రిశాంక్
రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉన్న సమయంలో నాటి ముఖ్యమంత్రి అంజయ్య గారిని బహిరంగంగా "బఫూన్" అని పిలిచారని, ఆ సమయంలో అంజయ్య గారు బహిరంగంగా ఏడుస్తూ కనిపించారని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ఇందుకు సంబంధించిన ఫొటోను ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. అంతేకాదు, అదే నెలలో అంజయ్యను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించారని పేర్కొన్నారు. అలాంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయడమేమిటని ప్రశ్నించారు.