Nara Lokesh: అలాంటి వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నాం: మంత్రి నారా లోకేశ్
- గత ఐదేళ్లు వర్సిటీలను రాజకీయ పునరావాస వేదికలుగా మార్చారన్న లోకేశ్
- వర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడి
- వర్సిటీలను తీర్చిదిద్దే సంకల్పం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని పిలుపు
రాజకీయాలకు అతీతంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించేందుకు నోటిఫికేషన్ ఇచ్చామని ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలకు ప్రాధాన్యత ఇచ్చి, ర్యాంకింగ్స్ మెరుగుపర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు.
ఏపీలోని వర్సిటీలను అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలకు దీటుగా తీర్చిదిద్దాలనే సంకల్పం కలిగిన ప్రొఫెసర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని మంత్రి నారా లోకేశ్ వివరించారు. దరఖాస్తులకు ఈ నెల 28న తుదిగడువు అని వెల్లడించారు.
గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చారని లోకేశ్ విమర్శించారు. గత ఐదేళ్లు వర్సిటీలు రాజకీయ కార్యకలాపాలకు వేదిక అయ్యాయని మండిపడ్డారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వ పాలనలో యూనివర్సిటీలను ప్రక్షాళన చేస్తున్నామని తెలిపారు.