Vangalapudi Anitha: ఆ ముగ్గురు ఐపీఎస్ ల వెనుక ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించం: అనిత
- ఆధారాలతోనే ముగ్గురు ఐపీఎస్ లను సస్పెండ్ చేశామన్న అనిత
- వారి వెనుక సూత్రధారులున్నా, సలహాదారులున్నా వదలబోమని హెచ్చరిక
- బోట్ లో బ్యారేజీని గుద్దించిన వాళ్లు టెర్రరిస్టులకన్నా డేంజరస్ అని వ్యాఖ్య
ముంబై హీరోయిన్ జెత్వానీ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతోందని ఏపీ హోంమంత్రి అనిత చెప్పారు. సస్పెండ్ అయిన ముగ్గురు ఐపీఎస్ అధికారుల కారణంగా ఎంతో మంది బలయ్యారని... విచారణలో వెలుగు చూసిన ఆధారాలతోనే వారిని సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ ముగ్గురు ఐపీఎస్ ల వెనుక ఎంత పెద్దవారు ఉన్నా ఉపేక్షించబోమని చెప్పారు. సూత్రధారులున్నా, సలహాదారులు ఉన్నా వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ప్రకాశం బ్యారేజ్ ను భారీ బోట్లు ఢీకొనడంపై అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కో బోట్ బరువు 40 టన్నులు ఉంటుందని తొలుత అనుకున్నామని... కానీ, 80 టన్నుల బరువు ఉన్నాయని చెప్పారు. ఆ బోట్లు వైసీపీ నేతల అనుచరులవేనని అన్నారు. 3 భారీ బోట్లను ఇనుప తాళ్లతో కట్టేశారని చెప్పారు.
బోట్లు వాటంతట అవే కొట్టుకురావా అని కొందరు అంటున్నారని... అట్లా ఎలా వస్తాయని అనిత ప్రశ్నించారు. ఈ దుర్మార్గానికి పాల్పడిన వారు టెర్రరిస్టుల కంటే డేంజరస్ అని చెప్పారు. బోట్లు ఢీకొనడంతో కేవలం కౌంటర్ వెయిట్ మాత్రమే విరిగిపోయిందని... బోట్లు పిల్లర్లను తగిలి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు. వైసీపీ నీచ రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.