Bandaru Dattatreya: గవర్నర్ కంటే ముందు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యకర్తను: బండారు దత్తాత్రేయ
- భాగ్యనగరం గణేశ్ నిమజ్జనం కార్యక్రమంలో పాల్గొన్న దత్తాత్రేయ
- 1981నుంచి ఉత్సవ సమితి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు వెల్లడి
- ఉత్సవంలో పాల్గొన్న వేలాదిమందిని చూస్తుంటే ఆనందంగా ఉందని వ్యాఖ్య
తాను హర్యానా గవర్నర్‌ను మాత్రమే కాదని... అంతకంటే ముందు భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యకర్తనని బండారు దత్తాత్రేయ అన్నారు. భాగ్యనగర్‌లో వినాయక నిమజ్జనం కార్యక్రమంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ... 1981 నుంచి భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు తెలిపారు.
గణేశ్ ఉత్సవాల్లో పాల్గొన్నా వేలాదిమందిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందన్నారు. మహిళలు, పిల్లలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలను కాపాడుతున్నారని ప్రశంసించారు. నగరంలో గణేశ్ నిమజ్జనం కార్యక్రమం ఎంతో వైభవంగా జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాయని ప్రశంసించారు.
హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులకు సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈరోజు అనంత చతుర్దశి, విశ్వకర్మ జయంతి, మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవమని గుర్తు చేశారు. 1948 అనంత చతుర్దశి రోజు హైదరాబాద్‌కు విమోచనం లభించిందన్నారు. ఇంకోవైపు, ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు అన్నారు. భారతదేశాన్ని మరింత ముందుకు నడిపే శక్తిని ఆ భగవంతుడు మోదీకి ఇవ్వాలని ప్రార్థిస్తున్నానన్నారు.