Nirmala Sitharaman: నేడు పిల్లల కోసం కొత్త పెన్షన్ స్కీమ్‌ను ప్రారంభించనున్న నిర్మలా సీతారామన్
- ఎన్పీఎస్ వాత్సల్యను ప్రారంభించనున్న కేంద్రమంత్రి
- తమ పిల్లల కోసం తల్లిదండ్రులు ఖాతా తెరువవచ్చు
- నిర్దిష్ట వయస్సు వచ్చాక సాధారణ ఎన్పీఎస్గా మార్చుకునే వెసులుబాటు
కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు కొత్త పెన్షన్ స్కీం 'వాత్సల్య'ను ప్రారంభించనున్నారు. ఈ స్కీంను ప్రత్యేకంగా పాఠశాల విద్యార్థుల కోసం రూపొందించారు. యూనియన్ బడ్జెట్ 2024లో ఈ పథకాన్ని ప్రకటించారు. ఈ కొత్త పథకం కింద తల్లిదండ్రులు తమ పిల్లలకు ఖాతాలను తెరువొచ్చు... పదవీ విరమణ పొదుపు కోసం తెరువొచ్చు.
నిర్మలా సీతారామన్ ఈ పథకాన్ని ఢిల్లీలో ప్రారంభిస్తారు. ఏకకాలంలో దేశవ్యాప్తంగా 75 ప్రాంతాల్లో ఎన్పీఎస్ వాత్సల్య కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఎన్పీఎస్-వాత్సల్య మైనర్ల తల్లిదండ్రులు, సంరక్షకులకు బహుమతిగా పరిచయం చేస్తున్నామని తెలిపింది. పిల్లలకు నిర్దిష్ట వయస్సు వచ్చాక వారి కోరిక మేరకు పథకాన్ని సాధారణ ఎన్పీఎస్గా మార్చుకోవచ్చునని వెల్లడించింది.
ఎన్పీఎస్ వాత్సల్య సబ్స్క్రిప్షన్ కోసం ఆన్లైన్ ప్లాట్‌పామ్‌ను, స్కీమ్ బ్రోచర్‌ను, కొత్త మైనర్ సబ్స్క్రైబర్ల కోసం ప్రాన్ కార్డును పంపిణీ చేయడం వంటి వాటిని నిర్మల ప్రారంభిస్తారు. ఇతర 75 ప్రాంతాల్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభం కానున్నాయి. కొత్త మైనర్ సబ్స్క్రైబర్లకు పాన్ (శాశ్వత పదవీ విరమణ ఖాతా నెంబర్) మెంబర్‌షిప్‌ను పంపిణీ చేయనున్నారు. ఎన్పీఎస్ వాత్సల్య ద్వారా తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద ఏడాదికి రూ.1,000 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. తల్లిదండ్రులు, సంరక్షకులు, భారతీయ పౌరులు, ఎన్నారైలు ఎన్పీఎస్ వాత్సల్య ఖాతాను తెరవడానికి అర్హులు.