Revanth Reddy: ఒకే వేదిక పంచుకోనున్న రేవంత్ రెడ్డి, కేటీఆర్.. ఎక్కడంటే..!

Revanth Reddy And KTR to share stage at Sitaram Yechury memorial

--


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకోనున్నారు. ఈ నెల 21 న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరగనున్న ఏచూరి సంస్మరణ సభకు ఈ నేతలు ఇద్దరూ హాజరుకానున్నారు. దీంతో వారిద్దరి భేటీ ఎలా ఉండబోతోంది.. వారు ఎలా పలకరించుకుంటారనే విషయంపై రాజకీయవర్గాల్లో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొంత సమయం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ.. ఆ తర్వాత హామీల అమలుకు సంబంధించి ఎక్కడికక్కడ నిలదీస్తోంది. ఆరు గ్యారంటీలు సహా కాంగ్రెస్ హామీలన్నీ అమలులో విఫలమైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ దాదాపుగా రోజూ విమర్శలు చేస్తున్నారు. ట్విట్టర్ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

వివిధ కార్యక్రమాలలో సీఎం రేవంత్ రెడ్డిని సూటిగా నిలదీస్తూ, పదునైన విమర్శలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దీటుగా ప్రతి విమర్శలు చేస్తోంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి, కేటీఆర్ ల మధ్య మాటలయుద్ధం కొనసాగుతోంది. తెలంగాణ తల్లి, రాజీవ్ గాంధీ విగ్రహాల ఏర్పాటుపై ట్వీట్లు, కౌంటర్ ట్వీట్లతో విమర్శలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే వారిద్దరి భేటీపై రాజకీయ వర్గాలతో పాటు సామాన్యులలోనూ ఆసక్తి నెలకొంది. కాగా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం పార్టీ ఏచూరి సంస్మరణ సభ నిర్వహించనుంది. ఈ సభకు హాజరుకావాలంటూ ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, అటు కేటీఆర్ ను సీపీఎం నాయకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి వారిరువురూ హాజరవుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News