Chandrababu: నేను గమనించింది ఏంటంటే చంద్రబాబు దేనికీ భయపడరు: పవన్ కల్యాణ్
- కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు
- మూడు పార్టీల ఎమ్మెల్యేలతో సమావేశమైన సీఎం చంద్రబాబు
- చంద్రబాబు సారథ్యంలో పనిచేయడం ఆనందంగా ఉందన్న పవన్
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల అయిన సందర్భంగా మంగళగిరి సీకే కన్వెన్షన్ సెంటర్ లో సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రసంగిస్తూ... చంద్రబాబు సారథ్యంలో పనిచేయడం ఆనందం కలిగించే విషయం అని అన్నారు.
చంద్రబాబులో తాను గమనించిన అంశం ఏమిటంటే, ఆయన దేనికీ భయపడే వ్యక్తి కాదని అన్నారు. విపక్షంలో ఉన్న సమయంలోనూ ఆయన కళ్లలో భయం కనిపించలేదని స్పష్టం చేశారు. అక్రమ కేసులో అరెస్టయి జైల్లో ఉన్న సమయంలో చంద్రబాబు గుండె ధైర్యాన్ని చూశానని తెలిపారు.
జీవితంలో అనేక కష్టనష్టాలు ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు అని వివరించారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు తాను షూటింగ్ లు కూడా మానేశానని, నిర్మాతలు అడిగినా రానని చెప్పానని పవన్ గుర్తుచేసుకున్నారు.
చంద్రబాబు ఎంతగా కష్టపడి పనిచేస్తారో ఇటీవల వరదల సమయంలో చూశానని వెల్లడించారు. పాతికేళ్ల యువకుడిలా ఆయన శ్రమించిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.
ఆయన స్వయంగా చేయడం ఎందుకు, అజమాయిషీ చేయవచ్చు కదా అని కొందరు అనుకోవచ్చు... కానీ క్షేత్రస్థాయిలో ఆయన పని చేయడం వల్ల ముఖ్యంగా అధికారులకు మార్గదర్శనం చేసినట్టయిందని, విపత్తు సమయాల్లో ఎలా పనిచేయాలో ఆయన ఒక దారి చూపించారని వివరించారు. ఒకరకమైన అలసత్వానికి లోనైన అధికారుల్లో చలనం తీసుకువచ్చారని చంద్రబాబుపై పవన్ కల్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు.
చంద్రబాబు ఓపిక చూస్తే ఆశ్చర్యం కలుగుతుందని, అయితే వైసీపీ మాత్రం విమర్శలు చేస్తోందని వ్యాఖ్యానించారు. మంచి పనులు చేసే చంద్రబాబు వంటి వ్యక్తి అందరూ అండగా ఉండాలని పవన్ పిలుపునిచ్చారు.