KTR: 'వన్ నేషన్ వన్ ఎలక్షన్'పై స్పందించిన కేటీఆర్
- జమిలి ఎన్నికలు ఎలా నిర్వహిస్తారో కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉందన్న కేటీఆర్
- ఆ తర్వాత బీఆర్ఎస్ తన వైఖరిని తెలియజేస్తుందని వెల్లడి
- వివిధ రాష్ట్రాల అసెంబ్లీలను రద్దు చేస్తారా? క్రమంగా జమిలి నిర్వహిస్తారా? అనేది చూడాలన్న కేటీఆర్
'ఒకే దేశం, ఒకే ఎన్నికలు'పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. దీనిని ఎలా అమలు చేస్తారనే అంశంపై కేంద్రం స్పష్టతను ఇచ్చిన తర్వాత బీఆర్ఎస్ తన వైఖరిని తెలియజేస్తుందని కేటీఆర్ వెల్లడించారు. జమిలి ఎన్నికలను ఎలా నిర్వహించాలని కేంద్రం భావిస్తుందో తెలియాల్సి ఉందని, ఈ ప్రక్రియకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యాక తమ నిర్ణయం వెల్లడిస్తామన్నారు.
"కేంద్ర ప్రభుత్వం 'ఒక దేశం, ఒకే ఎన్నికలు' కోసం తన ప్రణాళికను దేశ ప్రజల ముందుకు తీసుకు రావాలి. ప్రభుత్వం ఈ ఎన్నికలను ఎలా నిర్వహిస్తుంది? ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలాలను ఎలా రద్దు చేస్తారు? ఎలా నిర్వహిస్తారు? అనేది తెలియాల్సి ఉంది. ఈ రెండింటిని ఎలా నిర్వహిస్తారో ప్రజలకు వెల్లడించాల్సి ఉంది" అని పేర్కొన్నారు. ఎక్కడైనా ఉప ఎన్నికలు వస్తే ఏం చేస్తారనేది కూడా తెలియాల్సి ఉందన్నారు.
సార్వత్రిక ఎన్నికలు నాలుగైదు నెలల క్రితమే ముగిసినందున వచ్చే పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్‌కు నాలుగు సంవత్సరాలకు పైగా సమయం మిగిలి ఉందని గుర్తు చేశారు. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ప్రభుత్వం ముందుగా రద్దు చేస్తుందా? లేదా క్రమంగా జమిలి ఎన్నికలను నిర్వహించాలని యోచిస్తుందా? తెలియాల్సి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేయడం ద్వారా ఎన్నికలు ఒకేసారి నిర్వహించే ఆలోచన ఉందా? అనేది తెలియాలన్నారు.