Lebanon: మొన్న పేజర్లు పేలితే... తాజాగా వాకీటాకీలు పేలాయి!
- వాకీటాకీల పేలుడు ఘటనలో 9 మంది మృతి, 300మందికిపైగా గాయాలు
- లెబనాన్లో వరుస పేలుళ్లతో భయాందోళనలు
- ఈ దాడుల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని అనుమానాలు
లెబనాన్లో వరుస పేలుళ్ల ఘటనలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పేజర్ల పేలుళ్ల ఘటన నుండి తేరుకోకముందే తాజాగా వాకీటాకీల పేలుడు ఘటన చోటుచేసుకోవడం, తొమ్మిది మంది మృత్యువాత పడటం, వందలాది మంది గాయాలపాలవ్వడం ఆందోళన కల్గిస్తోంది. ఈ ఘటనలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
మంగళవారం పేజర్ల పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందగా, 2,800 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో లెబనాన్ లోని ఇరాక్ రాయబారితో పాటు హిజ్బుల్లా కీలక నేతలు ఉన్నారు. ఒకేసారి వందలాది పేజర్లు పేలిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు గురి చేసింది. ఈ ఘటన మరువకముందే బుధవారం లెబనాన్ రాజధాని బీరుట్లో వాకీటాకీలు పేలడంతో 300 మందికి పైగా గాయపడ్డారు. తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.
కమ్యూనికేషన్ వ్యవస్థే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోందని తెలుస్తోంది. ఇటీవలే ఇజ్రాయెల్ నుండి లెబనాన్ అధునాతన కమ్యూనికేషన్ పరికరాలను దిగుమతి చేసుకుంది. ఇందులో ఇజ్రాయెల్ పేలుడు పదార్ధాలు అమర్చి ఉంటుందని లెబనాన్ అనుమానిస్తోంది. ఈ అనూహ్య పరిణామాల వెనుక ఇజ్రాయెల్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే దీనిపై ఇజ్రాయిల్ మాత్రం ఇంత వరకూ స్పందించలేదు.