Asian Champions Trophy: కాంస్యం గెలిచిన పాక్ హాకీ జట్టుకు నగదు బహుమతి.. ఎంతో తెలిస్తే నిర్ఘాంతపోవడం ఖాయం!
- ఆటగాళ్లు, సిబ్బందికి ఒక్కొక్కరికి రూ. 8,366 చొప్పున నగదు బహుమతి
- ఈ మేరకు పాకిస్థాన్ హాకీ ఫెడరేషన్ ప్రకటన
- ఇంత తక్కువ ఇవ్వడమేంటని పీహెచ్ఎఫ్‌పై నెట్టింట విమర్శలు
- అసలు ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని నెటిజన్ల కామెంట్స్
ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సాధించిన పాకిస్థాన్ హాకీ జట్టుకు ఆ దేశ హాకీ ఫెడరేషన్ (పీహెచ్ఎఫ్) తాజాగా నగదు బహుమతి ప్రకటించింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు పీహెచ్ఎఫ్ ఆటగాళ్లు, సిబ్బందికి ప్రకటించిన బహుమతి ఎంతో తెలిస్తే నిర్ఘాంతపోవాల్సిందే.
ఆటగాళ్లు, సిబ్బందికి ఒక్కొక్కరికి 100 డాలర్ల (రూ. 8,366) చొప్పున బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపింది. పీహెచ్ఎఫ్ అధ్యక్షుడు మీర్ తారిక్ బుగ్తీ.. ఆటగాళ్లు, సిబ్బందికి మంజూరు అయిన ప్రత్యేక నగదు బహుమతిని ద్రువీకరిస్తూ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
టోర్నీలో జట్టు చూపిన అద్భుత ప్రదర్శనకు గుర్తింపుతో పాటు ప్రోత్సహించడానికి ఈ నగదు పురస్కారం అంటూ పీహెచ్ఎఫ్ తన పత్రికా ప్రకటనలో పేర్కొంది. అయితే, పీహెచ్ఎఫ్ ఇలా ప్లేయర్లకు అతి తక్కువ నగదు బహుమతి ఇవ్వడం పట్ల నెట్టింట విమర్శలు వస్తున్నాయి. ఇంత తక్కువ ఇవ్వడం దారుణమని, అసలు ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా సెమీ ఫైనల్స్‌లో ఆతిథ్య చైనా చేతిలో పాక్ కంగుతిన్న విషయం తెలిసిందే. పెనాల్టీ షూటౌట్‌లో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. ఆ తర్వాత కాంస్య పతక పోరులో కొరియాను 5-2తో ఓడించి టోర్నమెంట్‌లో మూడో స్థానాన్ని దక్కించుకుంది. కాగా, మంగళవారం నాగు జరిగిన ఫైనల్లో చైనాను ఓడించిన భారత జట్టు రికార్డు స్థాయిలో ఐదోసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది.