Chandrababu: కూటమి ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు సున్నిత హెచ్చరిక ..ఎందుకంటే..!
- ఇసుక రవాణాలో ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దని సూచించిన సీఎం
- మంగళగిరిలో ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు చంద్రబాబు హిత బోధ
- ఉచిత ఇసుక విధానం విజయవంతం అయ్యేందుకు సహకరించాలని సూచన
కూటమి నేతలకు సీఎం చంద్రబాబు సున్నిత హెచ్చరిక జారీ చేశారు. మంగళగిరిలో బుధవారం ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఇసుకలో జోక్యం చేసుకోవద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. ఉచిత ఇసుక విధానంపై ప్రతిపక్షం నుండి విమర్శలు వస్తున్న నేపథ్యంలో చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఉచిత ఇసుక విషయంలో జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవని పరోక్షంగా చంద్రబాబు హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలపై ఇప్పటికే విచారణ జరుగుతోందని అన్నారు. నియోజకవర్గాల్లో ఇసుక విషయంలో జోక్యం చేసుకోకుంటే రాబోయే రోజుల్లో మన గెలుపునకు అదే దోహదం చేస్తుందన్నారు.
కూటమి ఎమ్మెల్యేలు ఉచిత ఇసుక విధానం జయప్రదం చేసేలా సహకరించాలని చంద్రబాబు కోరారు. ఇదే సందర్భంలో అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు తదితర విషయాలపైనా ప్రసంగించారు. కొత్త మద్యం పాలసీ తీసుకువస్తున్నామని, నాణ్యమైన మద్యాన్ని రూ.99లకే ఇస్తామని తెలిపారు. అమరావతికి కేంద్రం రూ 15 వేల కోట్లు ఇస్తోందని, ఇంకా మరిన్ని నిధులకు హామీ ఇచ్చారని చెప్పారు. అమరావతికి నిధుల కొరత లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి జాతికి అంకితం చేయాలన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులతో పాటు మనం చేస్తున్న మంచి పనులను కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.