Coffee: కాఫీ ప్రియులకు శుభవార్త..!

3 Cups Of Coffee A Day May Lower Risk Of Developing Heart Condition Study
  • రోజుకు 3 కప్పులు తాగేవారిలో తగ్గుతున్న హృద్రోగాల ముప్పు
  • చైనా యూనివర్సిటీ సైంటిస్టుల అధ్యయనంలో వెల్లడి
  • కెఫైన్ ఉత్పత్తులతోనూ ఇదే ప్రయోజనం
మీరు కాఫీ ప్రియులా.. కాఫీ కానీ టీ కానీ గొంతులో పడితే కానీ రోజు మొదలవదా?.. అయితే మీకో శుభవార్త. నిత్యం మూడు కప్పుల కాఫీ కానీ టీ కానీ తాగే వారికి గుండె జబ్బులు వచ్చే ముప్పు సగానికి తగ్గుతుందట. టీ, కాఫీలలో ఉండే కెఫైన్ దీనికి కారణమని, ఇది మధుమేహం, పక్షవాతం వంటి జబ్బులను దూరం పెడుతుందని చైనా సైంటిస్టులు చెబుతున్నారు. ఈమేరకు వారు లక్షలాది మంది వాలంటీర్ల ఆరోగ్య వివరాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషించి ఈ విషయాన్ని కనుగొన్నారట.

రోజుకు మూడు కప్పుల కాఫీతో 200 నుంచి 300 మిల్లీగ్రాముల కెఫెన్ మన శరీరంలోకి చేరుతుందని, ఇదే హృద్రోగాలను దూరం పెడుతుందని చైనాలోని సుషౌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. కాఫీ, టీలు మాత్రమే కాదు కెఫైన్ ఉండే చాక్లెట్లు, ఎనర్జీ డ్రింకులు, స్నాక్ బార్స్.. ఇలా ఏవైనా సరే కానీ రోజుకు 300 మిల్లీగ్రాముల కెఫైన్ శరీరంలోకి చేరితే సరిపోతుందని చెప్పారు. కాఫీ, టీలు అస్సలు తాగని వారు, రోజుకు ఒకటీ అరా కప్పు తాగే వారితో పోలిస్తే మూడు కప్పులు తాగే వారిలో గుండె జబ్బుల ముప్పు 48 శాతం తక్కువగా ఉండడం తమ అధ్యయనంలో గుర్తించామని వివరించారు. ఈ మేరకు యూకో బయోబ్యాంక్ డేటా నుంచి లక్షలాది వ్యక్తుల వివరాలను సేకరించి, పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించామన్నారు.
Coffee
heart disease
Health
China
Study

More Telugu News