Somireddy Chandra Mohan Reddy: సంతోషించాల్సిన సమయంలో జగన్ బాధపడుతున్నాడు: సోమిరెడ్డి
- చంద్రబాబు పాలనలో పెట్టుబడులు భారీగా వస్తున్నాయని వెల్లడి
- జగన్ ఓర్వలేకపోతున్నాడని ఆగ్రహం
- జగన్ పాలనలో పెట్టుబడులే రాలేదన్న టీడీపీ సీనియర్ నేత
చంద్రబాబుపాలనలో ఏపీ రాజధాని అమరావతికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, దీన్ని చూసి జగన్మోహన్ రెడ్డికి కడుపు మంట మొదలైందని టీడీపీ సీనియర్ నేత, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. జగన్ పాలనలో ఏపీకి ఒక్క పెట్టుబడి కూడా రాలేదని అన్నారు. ఇప్పుడు ఏపీకి పెట్టుబడులు వస్తుంటే సంతోషించాల్సిన సమయంలో, జగన్ బాధపడుతున్నాడని మండిపడ్డారు.
"చంద్రబాబు విజనరీ పాలనను చూసి నేడు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియా, యూఏఈ ఆసక్తి చూపిస్తున్నాయి.. రూ.250 కోట్లతో ఎక్స్ఎల్ఆర్ఐ (Xavier School of Management) సంస్థ ఏర్పాటు కానుంది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయబోతున్నారు.
జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు బీసీఐ ( బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ) ప్రతినిధులు సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. రూ.300 కోట్లతో హెచ్ పీసీఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ, ఇండియన్ బ్యాంక్, ఎస్ బీఐ వంటి ప్రఖ్యాత సంస్థలు తమ కార్యకలాపాలను ఇక్కడ నుంచే మొదలుపెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఇలాంటి సందర్భంలో తెలుగువాడిగా పుట్టిన ప్రతివాడు ఏపీ ప్రజల భవిష్యత్తు బాగుపడుతుందని సంతోషించాలి. కానీ జగన్ బాధపడుతున్నాడు, రాజధానిపై విషం కక్కుతున్నాడు" అని విమర్శించారు.